Application For SBI ATM Card: భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మన దేశంలో అష్టదిక్కుల్లో విస్తరించింది. కోట్లాది మంది కస్టమర్లు ఎస్‌బీఐ సొంతం. ప్రతి కస్టమర్‌కు ATM కార్డ్‌ను స్టేట్‌ బ్యాంక్‌ అందిస్తోంది. ఏటీఎం కార్డ్‌ చేతిలో ఉంటే, బ్యాంక్‌కు వెళ్లకుండానే కొన్ని పనులు పూర్తి చేయొచ్చు. మీకు ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్‌ (డెబిట్‌ కార్డ్‌) కావాలంటే.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు, లేదా నేరుగా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. 


స్టేట్‌ బ్యాంక్‌ నుంచి ATM కార్డ్ తీసుకోవాలంటే, ముందుగా మీకు SBIలో సేవింగ్స్‌ అకౌంట్‌ (SBI Savings Account) లేదా కరెంట్‌ అకౌంట్ (SBI Current Account) ఉండాలి. మీ వయస్సు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply Online for SBI ATM Card?)


1. మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్, క్యాప్చా ఉపయోగించి SBI నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి.
2. ఇప్పుడు, హోమ్‌ పేజీలో కనిపించే "ఇ-సర్వీసెస్" విభాగానికి వెళ్లండి
3. ఇక్కడ కనిపించే ఆప్షన్ల నుంచి "ఏటీఎం కార్డ్ సర్వీసెస్‌" ఆప్షన్‌ ఎంచుకోండి.
4. ATM/డెబిట్ కార్డ్‌ దరఖాస్తు చేయడానికి.. "రిక్వెస్ట్‌ ఏటీఎం/డెబిట్ కార్డ్‌"పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు, OTP లేదా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌లో ఏది ఎంటర్‌ చేస్తారో ఎంచుకోండి. మీరు ఎంచుకున్న పద్ధతిని ఉపయోగించి అవసరమైన వివరాలు ఎంటర్‌ చేసి, ధృవీకరించండి.
6. మీకు కావలసిన అకౌంట్‌ను ఎంచుకోండి. ఏటీఎం కార్డ్‌/ డెబిట్‌ కార్డ్‌పై ముద్రించాల్సిన పేరు, కార్డ్ రకం వంటి వివరాలను నమోదు చేయండి.
7. ఇప్పుడు ఫైనల్‌ స్టెప్‌లోకి ఎంటర్‌ అవుతాం. మీరు ఇచ్చిన అన్ని వివరాలు మరోసారి సరిచూసుకుని, 'టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌' బాక్స్‌లో టిక్‌ చేయండి.
8. చివరిగా, మీ రిక్వెస్ట్‌ను సబ్మిట్‌ చేయండి. అంతే, ఏటీఎం కార్డ్‌ కోసం మీరు పెట్టుకున్న రిక్వెస్ట్‌ బ్యాంక్‌కు చేరుతుంది.


మీ ATM కార్డ్ ప్రాసెసింగ్, డెలివరీ టైమ్‌ గురించి మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీకి వివరాలు వస్తాయి.


ఇది కాకుండా, customercare@sbi.co.in కు మీ రిజిస్టర్డ్‌ ఈ-మెయిల్ ద్వారా రిక్వెస్ట్‌ కూడా పంపొచ్చు.


ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్ కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply Offline for SBI ATM Card?)


1. SBI కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్‌ చేయండి. రికార్డెడ్‌ వాయిస్‌ వినిపించిన తర్వాత, కొత్త డెబిట్ కార్డ్‌ రిక్వెస్ట్‌ కోసం అవసరమైన ఆప్షన్‌ ఎంచుకోండి. అంతే, కార్డ్‌ మీ రిజిస్టర్డ్‌ అడ్రస్‌కు వస్తుంది.
2. ఒకవేళ మీకు రికార్డెడ్‌ వాయిస్‌ అర్ధం కాకపోయినా, ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ తెలీకపోయినా, మీ సమీపంలో బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లండి. ఏటీఎం కార్డ్‌ కోసం ఫారం పూర్తి చేసి సంబంధింత అధికారికి ఇవ్వండి. ఆధార్‌ కార్డ్‌, పాన్ కార్డ్, అడ్రస్‌ ప్రూఫ్‌ వంటి అవసరమైన పత్రాలు సమర్పించండి. ఎస్‌బీఐ అధికారి మీ అప్లికేషన్‌ తీసుకున్న తర్వాత, బ్యాంక్‌ నుంచి ప్రాసెస్‌ మొదలు పెడతారు. నిర్ణీత గడువులోగా మీ ఇంటికి ఏటీఎం కార్డ్‌ వస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు కూడా మీకు అందుతుంటాయి.


మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా ప్రారంభించే ముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి