Go Fashion Shares: ఈ నెల ప్రారంభం నుంచి 14% లాభపడిన గో ఫ్యాషన్‌ (ఇండియా) షేర్ల నడక ఇప్పుడు తడబడుతోంది. ఈ షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ బొక్కబోర్లా పడ్డాయి. గో ఫ్యాషన్‌ కౌంటర్‌లో బ్లాక్ డీల్ కారణంగా, ఇవాళ (సోమవారం, 12 జూన్‌ 2023) ఓపెనింగ్‌ సెషన్‌లో, ఎన్‌ఎస్‌ఈలో 5% పైగా నష్టపోయాయి. గత రెండు సెషన్లలోనే ఈ స్టాక్‌ వాల్యూ 7 శాతం దిగొచ్చింది. అంటే, ఈ నెల ప్రారంభం నుంచి వచ్చిన లాభాల్లో సగం రెండు రోజుల్లోనే ఆవిరైంది.


దెబ్బకొట్టిన సీఖోయా క్యాపిటల్ డీల్‌
బ్లాక్ డీల్ ద్వారా గో ఫ్యాషన్‌లో 11% ఈక్విటీ చేతులు మారింది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ సీఖోయా క్యాపిటల్ (Sequoia Capital), గో ఫ్యాషన్‌లో 11% షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తోందని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఈ వెంచర్ క్యాపిటల్ కంపెనీ, సుమారు 57.5 లక్షల షేర్లను విక్రయించినట్లు తెలుస్తోంది.


బ్లాక్ డీల్ భారీగా జరగడంతో హయ్యర్‌ వాల్యూమ్స్‌తో అమ్మకాలు వెల్లువెత్తాయి, షేర్ ధర పతనమైనంది. ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ. 1,135 కి ఈ స్క్రిప్‌ పడిపోయింది.


మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి, NSEలో 74 లక్షల షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఆ సమయానికి 4.43% నష్టంతో రూ. 1,141.75 వద్ద షేర్లు కదులుతున్నాయి. ఈ మిడ్‌ క్యాప్‌ స్టాక్‌ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 6,130 కోట్లు. గత ఏడాది నవంబర్‌లో రూ. 1,453 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అప్పటి నుంచి క్రమంగా కిందకు పడుతోంది.


టెక్నికల్‌ అనాలిసిస్‌
ప్రస్తుతం, ఈ స్టాక్ దాని 50-డేస్‌ మూవింగ్ యావరేజ్‌ కంటే పైన; 200-డేస్‌ యావరేజ్‌ కంటే కింద ట్రేడ్‌ అవుతోంది.


ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, 64.9 వద్ద, మొమెంటం ఇండికేటర్ RSI 'ఓవర్‌బాట్' జోన్‌కు చేరుకుంది. MFI 76.2 వద్ద ఇప్పటికే ఓవర్‌బాట్ జోన్‌లో ఉంది. సాధారణంగా, 30 స్థాయి కంటే దిగువన స్టాక్‌ ట్రేడ్‌ అవుతుంటే ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉన్నట్లు; 70 కంటే ఎక్కువ ఉంటే ఓవర్‌బాట్ టెరిటరీలో ట్రేడ్ అవుతోందని మార్కెట్‌ భావిస్తుంది.
గత నెల రోజులుగా ఈ స్టాక్‌లో అధిక అస్థిరత కనిపించింది. ఆ సమయంలో బీటా 1.39గా ఉంది.


గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ దాదాపు 4 శాతం లాభపడింది. గత ఒక ఏడాది కాలంలో 15 శాతం పైగా రిటర్న్‌ ఇచ్చింది. అయితే, గత 6 నెలల కాలంలో మాత్రం దాదాపు 5 శాతం; ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 శాతం పైగా నష్టపోయింది. 


మరో ఆసక్తికర కథనం: సిబ్బంది దెబ్బకు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మైండ్‌ బ్లాంక్‌, ఈ కష్టం ఏ బాస్‌కు రాకూడదు 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.