Capital Foods: మన దేశంలో చింగ్స్ సీక్రెట్ బ్రాండ్‌తో ఫుడ్‌ బిజినెస్‌ చేస్తున్న క్యాపిటల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Capital Foods Pvt Ltd), తన వ్యాపారం మొత్తాన్ని అమ్మకానికి పెట్టింది. దీనిని కొనడానికి భారతదేశంలోని ప్రఖ్యాత సంస్థలతో పాటు. గ్లోబల్‌ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. 


రేస్‌లో గ్లోబల్‌ దిగ్గజాలు
తుది బిడ్డర్స్‌ లిస్ట్‌లో.. టాటా గ్రూప్ ‍‌(TATA Group), హిందుస్థాన్ యూనిలీవర్ ‍‌(Hindustan Unilever), ఐటీసీ (ITC), ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ గ్రూప్ నెస్లే, (Nestle),  ప్రపంచంలోని ఐదో అతి పెద్ద ఆహార & పానీయాల కంపెనీ క్రాఫ్ట్ హీంజ్ ‍‌(Kraft Heinz), నార్వేకి చెందిన, MTR & ఈస్టర్న్ కాండిమెంట్స్ పేర్లతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపారం కొనసాగిస్తున్న ఓర్ల్కా ‌(Orkla), జపాన్‌కు చెందిన అతి పెద్ద నూడిల్ ఫుడ్ కంపెనీ నిస్సిన్ ఫుడ్స్‌ ‍‌(Nissin Foods) వంటి అనేక సంస్థలు ఉన్నాయి. 


క్యాపిటల్ ఫుడ్‌లోని ముగ్గురు ప్రధాన ఇన్వెస్టర్లు, తమ వాటాను విక్రయించాలని గత ఏడాదే నిర్ణయించాయి. ఆ మూడు ప్రధాన వాటాదార్లు.. యూరప్‌కు చెందిన ఇన్వస్ గ్రూప్ (40 శాతం వాటా ఉంది), US ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ జనరల్ అట్లాంటిక్ ‍(35 శాతం వాటా ఉంది), క్యాపిటల్ ఫుడ్ చైర్మన్ అజయ్ గుప్తా (మిగిలిన 25 శాతం వాటా ఉంది).


క్యాపిటల్ ఫుడ్‌ను 1995లో అజయ్ గుప్తా స్థాపించారు. ఈ కంపెనీ, భారతదేశంలో సూప్, నూడిల్స్‌, మసాలాలు, కర్రీ పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, సాస్‌లు, బేక్డ్ బీన్స్ వంటి వాటిని ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. చింగ్స్ సీక్రెట్ ‍‌(Ching's Secret), స్మిత్ & జోన్స్ ‍‌(Smith & Jones) బ్రాండ్‌తో ఈ ఆహార పదార్థాలను అమ్ముతోంది.


మేలో బిడ్డింగ్ జరిగే అవకాశం
భారత్‌ సహా ప్రపంచంలోని పెద్ద ఫుడ్ కంపెనీలు క్యాపిటల్ ఫుడ్ కొనుగోలు రేసులో చేరడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ పోటీ గత కొన్ని వారాలుగా ఊపందుకుంది. ఇప్పటికే చాలా కంపెనీలు క్యాపిటల్‌ ఫుడ్స్‌ మేనేజ్‌మెంట్‌తో సమావేశాలు నిర్వహించాయి. మిగిలిన కొనుగోలుదార్లు బిడ్‌కు ముందు సమావేశాన్ని నిర్వహించవచ్చు. క్యాపిటల్ ఫుడ్ కోసం బిడ్డింగ్ ప్రక్రియ మే నెలలోపు పూర్తవుతుంది. 


డీల్ సైజ్‌ కారణంగా రిలయన్స్‌ దూరం!
2021-22 ఆర్థిక సంవత్సరంలో, క్యాపిటల్ ఫుడ్స్‌ కంపెనీ 14 శాతం నష్టాన్ని చవిచూసింది. ఈ కారణంగా కంపెనీ ఆదాయం రూ. 580 కోట్లకు తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 900 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. క్యాపిటల్ ఫుడ్స్‌ కోసం బిడ్డింగ్ విలువ 1 బిలియన్ డాలర్ల నుంచి 1.25 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని లెక్కగడుతున్నారు. దేశంలో ఏ కంపెనీ అమ్మకానికి వచ్చినా కొనడానికి ముందుండే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, క్యాపిటల్‌ ఫుడ్స్‌ బిడ్స్‌కు మాత్రం దూరంగా ఉంది. ఈ కంపెనీ చెబుతున్న రేటు చాలా ఎక్కువని రిలయన్స్‌ భావిస్తుండడం వల్ల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.


క్యాపిటల్ ఫుడ్స్‌ కొనుగోలు లావాదేవీ మొత్తం నగదు రూపంలో జరుగుతుందా, లేక కొంత మొత్తం స్టాక్ రూపంలో జరుగుతుందా అనేది స్పష్టంగా లేదు. కొంతమంది కొనుగోలుదార్లు ఈ కంపెనీలో 75% వరకు వాటాను కొనుగోలు చేయాలని, ఆ తర్వాత దీనిని స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.