SBI - GDP Data: 2022-23 ఆర్థిక సంవత్సరం (FY23‌) మూడో త్రైమాసికంలో (అక్టోబర్ - డిసెంబర్ కాలం) దేశీయ స్థూల వృద్ధి 4.6% ఉండవచ్చని ఎస్‌బీఐ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్, భారత ఆర్థిక వృద్ధిపై కొత్త అంచనాలు విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP 7%గా ఉండవచ్చని వెల్లడించారు. గతంలో, 6.8% GDPని ఎస్‌బీఐ అంచనా వేసింది.    


మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. అయితే, 30 హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌లు గత త్రైమాసికాల్లోలా బలంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. FY23 డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వేసిన అంచనా 4.4 శాతం కంటే SBI వేసిన అంచనా ఎక్కువగా ఉంది.           


స్టేట్‌ బ్యాంక్‌ నివేదిక ప్రకారం, GDP తక్కువ అంచనాకు కార్పొరేట్ ఫలితాలు గొప్పగా లేకపోవడం కూడా ఒక కారణం. ఎస్‌బీఐ డేటా ప్రకారం, కంపెనీల నిర్వహణ లాభం (Operating Profit) కేవలం 9 శాతం చొప్పున పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 18 శాతం చొప్పున పెరిగింది. కార్పొరేట్‌ ఆదాయాలు 15 శాతం పెరిగినప్పటికీ, లాభాలు 16 శాతం తగ్గాయి.      


FY 2019-20, FY 2020-21 & 2021-22 కోసం GDP గణాంకాలను ప్రభుత్వం సమీక్షించవచ్చని తాము భావిస్తున్నట్లు సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. వీటితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి & రెండో త్రైమాసికం GDP గణాంకాలను కూడా సమీక్షించే అవవకాశం ఉందనన్నారు. దీనివల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP నంబర్‌ పెరగవచ్చు.      


ఇతర ఆర్థిక సంస్థల అంచనాలు       
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నెలవారీ బులెటిన్‌లో అంచనా వేసింది.     


అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కూడా.. 2022-23 & 2023-24 ఆర్థిక సంవత్సరాల కోసం భారతదేశ GDP వృద్ధి అంచనాను వరుసగా 6.8 శాతం, 6.1 శాతం వద్ద నిలుపుకుంది. భారతదేశంలో GDP వృద్ధి రేటు 2022-23లో 6.8 శాతం నుంచి 2024-25లో 6.8 శాతానికి చేరుకోవచ్చని, అయితే, ఆ వృద్ధికి ముందు 2023-24లో 6.1 శాతానికి తగ్గుతుందని IMF పేర్కొంది.     


 


అంతకుముందు, ఇండియా రేటింగ్స్ తన నివేదికలో 2023-24లో భారతదేశ జీడీపి 5.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. అన్ని ఇతర సంస్థల అంచనాలతో పోలిస్తే ఇదే తక్కువ. అయితే, మూలధన వ్యయం కోసం బడ్జెట్ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచడం, కార్పొరేట్‌ రుణాల్లో మొండి బకాయిలు తగ్గడం, ఉత్పత్తి ఆధారిత పథకాలు (PLI స్కీమ్స్‌) పెంపు, కమొడిటీల ధరలు తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే, 2023-24లో ఆర్థిక వృద్ధిని 6 శాతానికి మించి తీసుకెళ్లడానికి ఇవి మాత్రమే సరిపోవని తెలిపింది.