Gautam Adani:
గౌతమ్ అదానీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. షేర్లను కుదవపెట్టి తీసుకున్న రుణాల్లో కొన్ని ముందుగానే తీర్చబోతున్నారని సమాచారం. వీటి విలువ రూ.7000-8000 కోట్ల వరకు ఉండబోతోంది. ఇన్వెస్టర్ల ఆందోళన తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికే ఇలా చేయబోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికప్పుడు అప్పులను తగ్గించుకోవడం మొదలుపెట్టి రాబోయే 30-45 రోజుల్లో సున్నాకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
వ్యాపారాలను విస్తరించేందుకు అదానీ గ్రూప్ జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, సంస్థల నుంచి రుణాలు సేకరించింది. ఇందులో క్రెడిట్ సూయిజ్, జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ బ్యాంకులు, జేఎం ఫైనాన్షియల్ వంటి ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో కొన్నింటికి మే నెల్లో అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉంది. మరికొన్నింటికి సెప్టెంబర్లో, 2024 జనవరిలో ఇవ్వాల్సి ఉంది.
గ్రూప్ కంపెనీల్లో ఇప్పటికే ఉన్న కొన్ని షేర్ హోల్డింగ్ పొజిషన్లను వదలుకోవాలని ప్రమోటర్ కుటుంబం నిర్ణయించుకుందట. నిధుల సేకరణకు పెట్టుబడులను అమ్మేయాలని, కొన్ని వ్యూహాత్మక ఆర్థిక వనరులను వాడుకోవాలని భావిస్తోంది. '30-45 రోజుల్లోనే షేర్లను కుదవపెట్టి తీసుకున్న రుణాలను సున్నాకు తీసుకురావాలన్నదే మా ప్రణాళిక' అని అదానీ గ్రూప్‌నకు చెందిన ఓ అధికారి తెలిపారు. అవసరమైతే అదనంగా తమ షేర్లను ఆఫర్ చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. అయితే కంపెనీ అధికార ప్రతినిధుల్లో ఎవ్వరూ దీనిపై ఇంకా స్పందించలేదు.
అదానీ గ్రూప్ కంపెనీలకు 2022, మార్చి నాటికి రూ.1.88 లక్షల కోట్ల స్థూల రుణాలు ఉన్నాయి. చేతిలో ఉన్న నగదును పరిగణనలోకి తీసుకుంటే రూ.1.61 లక్షల కోట్లు నికర అప్పులుగా తేలాయి. ఇందులో రూ.70 వేల కోట్ల వరకు భారత బ్యాంకుల నుంచి సేకరించారని తెలిసింది. మిగిలినవి విదేశీ బ్యాంకులు, పెట్టుబడిదారులు సమకూర్చారు.
అదానీకి జరిగిన నష్టం ఎంత?
భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న అదానీ గ్రూప్ మీద అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో, అదానీ గ్రూప్ స్టాక్స్ పాతాళానికి పడిపోయాయి. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ స్టాక్స్ విలువ 100 బిలియన్లకు పైగా క్షీణించింది, దాదాపు సగం ఆవిరైంది. ఈ పతనం, గౌతమ్ అదానీని ప్రపంచ సంపన్నుల జాబితాలోని 3 స్థానం నుంచి అతి దూరంగా నెట్టేసింది. ప్రస్తుతం, సంపన్నుల జాబితాలో 22వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించినప్పటికీ అదానీ గ్రూప్ షేర్లలో పతనం, గౌతమ్ అదానీ నికర విలువ క్షీణత ఆగలేదు.
ఫిచ్ రేటింగ్స్ ఇవి
ఫిచ్ రేటింగ్స్, ప్రస్తుతం అదానీ గ్రూప్‌లోని 8 కంపెనీలకు రేటింగ్ ఇచ్చింది. ఇందులో అదానీ ట్రాన్స్‌మిషన్ BBB-/ Stable పొందింది. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ జారీ చేసిన సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB- రేటింగ్ పొందాయి. అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB-/ Stable రేటింగ్, అదానీ ట్రాన్స్‌మిషన్ BBB-/ Stable రేటింగ్, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB-/Stable రేటింగ్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ బాండ్స్‌కు BBB-/ Stable రేటింగ్‌ను ఫిచ్ ఇచ్చింది.
దీనికి ముందు, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) కూడా ఒక ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన అన్ని రేటింగ్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.