Gautam Adani:


అదానీ vs హిండెన్‌ బర్గ్‌.. యుద్ధం ఇంకా మిగిలే ఉన్నట్టు కనిపిస్తోంది! తాజాగా అదానీ గ్రూప్‌ (Adani Group) అడుగులు వేస్తున్న తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది! హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, దురుద్దేశ పూర్వకంగానే ఇచ్చినట్టు నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన న్యాయసంస్థ వాచ్‌టెల్‌ను సంప్రదించారని సమాచారం. ఈ మేరకు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది.


కొన్ని రోజుల క్రితం వరకు గౌతమ్‌ అదానీ (Gautam Adani) ప్రపంచంలోనే రెండో అపర కుబేరుడిగా ఉన్నారు. తిరుగులేని రీతిలో వ్యాపారాలను విస్తరిస్తూ వెళ్లారు. ఈ క్రమంలో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని, డొల్ల కంపెనీలు సృష్టించిందని అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ రిపోర్టు విడుదల చేసింది. అదానీ కంపెనీల షేర్లను షార్ట్‌ సెల్లింగ్‌ చేసింది. దాంతో ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పోర్ట్స్‌ సహా అన్ని కంపెనీల షేర్లు రికార్డు కనిష్ఠాలకు చేరుకున్నాయి. మొత్తం అదానీ గ్రూపు 117 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను నష్టపోయింది.


అదానీ కుటుంబం పన్నుల్లేని దేశాల్లో డొల్ల కంపెనీలు సృష్టించిందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. అక్కడ్నుంచి అవినీతి, అక్రమాలకు పాల్పడిందని పేర్కొంది. పన్నులు ఎగ్గొట్టిందని తెలిపింది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని అదానీ గ్రూప్‌ ఖండించింది. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఎక్కువ ఖాతాలు తీయాల్సి వస్తుందని వెల్లడించింది. తమ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయని గౌతమ్ అదానీ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.


ప్రస్తుతం హిండెన్‌బర్గ్‌ నిశ్శబ్దంగా ఉంది. షార్ట్‌ సెల్లింగ్‌  (Short Selling) ద్వారా లాభాలు ఆర్జించాక ఏమీ మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ అమెరికా న్యాయసంస్థను సంప్రదించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు మెరుగైన ఫలితాలు ప్రకటిస్తుండటంతో అదానీ గ్రూప్‌ (Adani Group) షేర్లు తిరిగి పుంజుకుంటున్నాయి. కార్పొరేట్‌  కంపెనీల్లో సంక్షోభాలు తలెత్తినప్పుడు న్యాయసంస్థల సహకారం తీసుకోవడం కొత్తేమీ కాదు. 2022లో ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయనని ప్రకటించడంతో ట్విటర్‌ ఇదే న్యాయసంస్థ సాయం తీసుకుంది. తమ కంపెనీని కచ్చితంగా కొనుగోలు చేసేలా ప్రయత్నించిందని రాయిటర్స్‌ తెలిపింది.


Also Read: క్రిప్టో రెడ్‌ టెర్రర్‌ - బిట్‌కాయిన్‌ రూ.90వేలు పతనం! భయపడుతున్న ఇన్వెస్టర్లు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.