LIC Q3 Results: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (LIC), 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్ - డిసెంబర్ కాలానికి రూ. 8334.2 కోట్ల లాభాన్ని ఈ బీమా కంపెనీ ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ. 235 కోట్ల లాభం కంటే, ఇప్పుడు ఏకంగా 34 రెట్ల ఎక్కువ లాభాన్ని కళ్లజూసింది.


మూడో త్రైమాసికంలో (డిసెంబర్‌ త్రైమాసికం), నికర ప్రీమియం ఆదాయం (Net premium income) సంవత్సరానికి (YoY) 14% పెరిగి రూ. 1.12 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 98,052 కోట్లుగా ఉంది.


పెట్టుబడులపై వచ్చిన ఆదాయం (Income from investments) గత ఏడాది డిసెంబర్‌ త్రైమాసికంలోని రూ. 76,825 కోట్లతో పోలిస్తే ఈసారి 10% పెరిగి రూ. 85,128 కోట్లకు చేరుకుంది.


నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) రూ. 40.12 లక్షల కోట్ల నుంచి YoYలో రూ. 44.34 లక్షల కోట్లకు పెరిగింది, ఇది 10.54% వృద్ధి.


కొత్త వ్యాపారం విలువ
బీమా కంపెనీల ఫలితాల్లో చూడాల్సిన అత్యంత కీలక విషయం కొత్త వ్యాపార విలువ (value of new business - VNB). 2022 డిసెంబర్‌తో ముగిసిన  తొమ్మిది నెలల కాలానికి కొత్త వ్యాపారం విలువ రూ. 7,187 కోట్లుగా ఉంది. గ్రాస్‌ VNB మార్జిన్ 19.1%గా - నెట్‌ VNB మార్జిన్‌ 14.6%గా లెక్క తేలింది.


LIC వ్యాపార వృద్ధి బలంగా కొనసాగుతోంది, కొత్త కష్టమర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా, మొదటి సంవత్సరం ప్రీమియంలో (కొత్త కస్టమర్‌ నుంచి వచ్చిన ఆదాయం) మార్కెట్ వాటా 2022 డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు 65.38%గా ఉంది. గత సంవత్సరం ఇదే కాలానికి ఇది 61.40%గా ఉంది.


వ్యక్తిగత వ్యాపారంలో, APE ప్రాతిపదికన, డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు నాన్-పార్ బిజినెస్ వాటా 9.45%కి పెరిగింది.


ఏప్రిల్-డిసెంబర్ కాలంలో, వ్యక్తిగత విభాగంలో మొత్తం 1.29 కోట్ల పాలసీలను ఈ కంపెనీ విక్రయించింది. తద్వారా 1.92% YoY వృద్ధిని నమోదు చేసింది.


కంపెనీ వ్యయాలు కాస్త పెరిగాయి. డిసెంబర్ 2022తో ముగిసిన తొమ్మిది నెలల నిర్వహణ వ్యయ నిష్పత్తి, గత ఏడాది ఇదే కాలంలోని 14.99%తో పోలిస్తే 27 bps పెరిగి 15.26%కి చేరుకుంది.


తమ వాటాదారులకు మంచి విలువను ఇవ్వగల పోర్ట్‌ఫోలియోను రూపొందించడంపై కంపెనీ దృష్టి ఉందని, ఈ ఫలితాల సందర్భంగా LIC చైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పారు. బీమా మార్కెట్ అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోందని, మార్కెట్ వాటాలో పట్టును కొనసాగించి మరింత వృద్ధి చెందగలమన్న విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. 


గురువారం LIC షేరు 0.48 శాతం లాభంతో రూ. 613 వద్ద ముగిసింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం 10.05 గంటల సమయానికి 2.14 శాతం లాభంతో రూ. 626 వద్ద ఉన్నాయి. ఈ స్టాక్ ఇప్పటికీ దాని IPO ధర రూ. 949 కంటే దాదాపు 35% దిగువన ట్రేడవుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.