Forbes Asia Heroes: సంపాదించడంలోనే కాదు, దాతృత్వంలోనూ తానూ సాటి లేని మేటి అని నిరూపించుకున్నారు అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ (Gautam Adani). ఆసియాలో, దాన గుణంలో ముందున్న ముగ్గురు బిలియనీర్లలో ఒకరిగా గౌతమ్ అదానీ నిలిచారు. అదానీతో పాటు శివ్ నాడార్, అశోక్ సూతా, మలేషియన్ ఇండియన్ వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్ & ఆయన భార్య శాంతి కండియా ఈ లిస్ట్‌లో ఉన్నారు.
‘ఫోర్బ్స్ ఏసియస్ హీరోస్ ఆఫ్ ఫిలాంత్రపీ’ (Forbes Asia's Heroes of Philanthropy) 16వ ఎడిషన్‌ను ఫోర్బ్స్ విడుదల చేసింది. అయితే, ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్లకు ఎలాంటి ర్యాంకులు ఇవ్వలేదు. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో బలమైన దాతృత్వాలకు వ్యక్తిగతంగా అండగా నిలిచిన 15 మంది ప్రముఖ వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
జాబితాలో అగ్రస్థానంలో అదానీ
ఈ ఏడాది జూన్‌లో తనకు 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా, సామాజిక సేవ కార్యక్రమాల కోసం రూ. 60 వేల కోట్ల రూపాయలను అదానీ ప్రకటించారు. ఇదే ఆయన్ను భారతదేశపు అత్యంత ఉదార వ్యక్తుల్లో ఒకరిగా నిలబెట్టిందని ఫోర్బ్స్ ప్రకటించింది. అదానీ ప్రకటించిన డబ్బును ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్య అభివృద్ధికి ఉపయోగిస్తారు. 1996లో అదానీ కుటుంబం ప్రారంభించిన అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలను చేపడతారు. ప్రతి సంవత్సరం, ఈ ఫౌండేషన్ భారతదేశంలోని దాదాపు 37 లక్షల మందికి సహాయం చేస్తుంది.
శివ్ నాడార్
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) ఫౌండర్ & ఛైర్మన్, స్వయంకృషితో బిలియనీర్‌గా ఎదిగిన శివ్ నాడార్ (Shiv Nadar) కూడా భారత దేశ అపర దాన కర్ణుల్లో ఒకరు. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా కొన్ని దశాబ్దాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి కోసం దాదాపు 1 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 8200 కోట్లు) ఆయన అందించారు. 1994లో తాను స్థాపించిన శివ్ నాడార్ ఫౌండేషన్‌కు ఈ సంవత్సరం రూ. 11,600 కోట్లు విరాళంగా ఇచ్చారు. విద్య ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించడానికి, మెరుగైన సమాజాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యంతో... నాడార్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలు & విశ్వవిద్యాలయాలు వంటి విద్యాసంస్థలను స్థాపించడంలో సహాయం చేస్తున్నారు. 2021లో, ఈ ఐటీ సర్వీసెస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పాత్రల నుంచి శివ్ నాడార్ వైదొలిగారు.
అశోక్ సూతా
టెక్ టైకూన్, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ (Happiest Minds Technologies) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అశోక్ సూతా (Ashok Soota). ఎస్‌కేఏఎన్ - సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ఏజింగ్ అండ్ న్యూరోలాజికల్ ఎయిల్‌మెంట్స్ (SKAN- Scientific Knowledge for Ageing and Neurological ailments) పేరిట ఒక వైద్య పరిశోధన ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దానికి రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు, ఆ డబ్బును 3 రెట్లు పెంచి రూ. 600 కోట్లు ఇస్తానని గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించారు. వృద్ధాప్యం, నరాల సంబంధిత వ్యాధుల మీద ఆ సంస్థ అధ్యయనం చేస్తుంది. హ్యాపీయెస్ట్ మైండ్స్‌లో మెజారిటీ వాటా ఉన్న అశోక్ సూతా, దాని నుంచి సంపద పొందుతున్నారు.
బ్రహ్మల్ వాసుదేవన్, శాంతి దంపతులు
మలేషియాలో స్థిరపడిన భారతీయ దంపతులు బ్రహ్మల్ వాసుదేవన్, శాంతి. క్రెడార్ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థను స్థాపించి, దానికి CEOగా బ్రహ్మల్ పని చేస్తున్నారు. శాంతి ఒక లాయర్. క్రెడార్ ఫౌండేషన్ ద్వారా మలేషియా, భారత్‌లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మలేషియాలో ఒక మెడికల్ హాస్పిటల్ నిర్మాణం కోసం ఈ ఇద్దరూ 50 మిలియన్ మలేషియా రింగ్‌గిట్స్ (11 మిలియన్ డాలర్ల) ఇస్తామని ఈ ఏడాది మే నెలలో ప్రకటించారు. అదే నెలలో, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు కూడా 30 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు.