బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. తుపానుపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. తుపాను ఎదుర్కునేందుకు తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా దక్షిణాంధ్ర జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు మరో రెండు సమీప జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వివరించారు. ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాలను ఇప్పటికే పూర్తి అప్రమత్తం చేశామని తెలిపారు. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లు, రిజర్వాయర్లకు గండ్లు పడకుండా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.
ప్రస్తుతం 11 ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, 10 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి వివరించారు. తుఫాను దృష్ట్యా మత్స్యకారులు ఎవరూ సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని అంతేగాక ఎవరైనా ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్ళి ఉంటే వారు వెంటనే తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని సందేశాలు పంపినట్టు కేబినెట్ కార్యదర్శికి సిఎస్ వివరించారు. తుపాను ప్రభావం ఉండే ఆయా జిల్లాల యంత్రాంగాలను పూర్తిగా అప్రమత్తం చేసి సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
వీడియో సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ మాట్లాడుతూ తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మూడు రాష్ట్రాలు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను,గుడిసెలు,కచ్చా ఇళ్ళలో నివసించే వారిని పూర్తిగా అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను ముందస్తు సన్నాహక ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అన్ని విధాలా పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉండాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. తుపాన్ తీవ్రత నేపథ్యంలో గత అనుభవాలను పరిగణంలోకి తీసుకోవాలని రాజీవో గౌబ వ్యాఖ్యనించారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆగ్నేయంగా పయనిస్తోంది. సుమారు 22 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుంతో చెన్నైకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
ఆగ్నేయంగా దూసుకొస్తున్న ఈ వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందనుంది. గురువారం ఉదయాని కల్ల ఉత్తర తమిళనాడు, పుదిచ్చేరీ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను తాకనుంది.
ఇవాళ, రేపు(బుధవారం, గురువారం)తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుపాను తీరం దాటే శుక్రవారం మాత్రం వర్షాలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపనుంది. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాయలసీమలో కూడా వర్షాలు కుమ్మేయనున్నాయి