Future Retail Shares : ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిడెడ్‌ (FRL) షేర్లు ఇవాళ (మంగళవారం, 11 ఏప్రిల్‌ 2023) కూడా బిగ్‌ జంప్ చేశాయి. నిన్న 4 శాతం పెరిగి రూ. 2.40 కి చేరుకున్న షేర్లు, ఇవాళ కూడా 4 శాతం పెరిగి రూ. 2.60 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి. 


భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (బిగ్‌ బజార్‌) కొనుగోలు కోసం దిగ్గజాలు రేసులోకి దిగాయి. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జిందాల్ గ్రూప్‌ సహా 49 కంపెనీలు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని వ్యక్తీకరిస్తూ ‍‌(Expression of interest - EoI) దరఖాస్తు చేశాయి. అందువల్లే FRL షేర్లలో జంప్ కనిపించింది. 


కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు రేసులో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ (Reliance Retail Ventures Limited), అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ & ఫ్లెమింగో గ్రూప్‌ పార్ట్‌నర్‌షిప్‌ కంపెనీ ఏప్రిల్‌ మూన్‌ (April Moon Retail Pvt Ltd -AMRPL), జిందాల్ గ్రూప్, గోర్డాన్ బ్రదర్స్, WH స్మిత్ EoI సమర్పించాయి. అదానీ, అంబానీ పేర్ల చేరికతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. 


835 బిగ్‌ బజార్‌ స్టోర్లు స్వాధీనం
గత ఏడాది ఫిబ్రవరిలో, ఫ్యూచర్ రిటైల్‌ లిమిటెడ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 835 బిగ్‌ బజార్‌ స్టోర్లను అద్దె బకాయిల కింద రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది, వాటిని రిలయన్స్‌ స్మార్ట్ స్టోర్‌లుగా మార్చింది. ఇది జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఈ కంపెనీ అమ్మకానికి వచ్చింది. ఇప్పుడు 49 మంది కొత్త బిడ్డర్ల నుంచి దరఖాస్తులు వచ్చాయని కంపెనీ తెలిపింది. 


వాస్తవానికి.. ఫ్యూచర్ రిటైల్‌ను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020 ఆగస్టులోనే రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 19 ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల ఆస్తులను రిలయన్స్‌ రిటైల్‌కు బదిలీ చేయాలి. అయితే, ఆ ఒప్పందంపై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్‌కు కూడా పెట్టుబడి ఉంది. అమెజాన్‌ కోర్టుకు ఎక్కడంతో, రిలయన్స్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య ఒప్పందం ముందుకు సాగలేదు.


గతంలోనూ బిడ్డింగ్‌ ప్రక్రియ
ప్రస్తుతం, ఫ్యూచర్ రిటైల్‌ లిమిటెడ్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. గతంలోనూ ఇదే తరహాలో EoIలు వచ్చాయి. 11 మంది బిడ్డర్లతో రూపొందించిన తుది జాబితాలో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌, ఏప్రిల్‌ మూన్‌ రిటైల్‌ కూడా ఉన్నాయి. అయితే.. ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది, రెండుసార్లు గడువు పొడిగించినా ఒక్క రిజల్యూషన్‌ ప్లాన్‌ కూడా ఈ 11 మంది బిడ్డర్స్‌ నుంచి రాలేదు. దీంతో, ఇప్పుడు వ్యూహం మార్చి బిడ్స్‌ ఆహ్వానించారు. ఫ్యూచర్ రిటైల్‌ ఆస్తులను ఏకమొత్తంగా, క్లస్టర్లుగా విభజించి తాజా బిడ్లు పిలిచారు.


ఫ్యూచర్ రిటైల్ విక్రయాన్ని ఒప్పందానికి సంబంధించిన మొదటి క్లస్టర్‌లో రిటైల్ రిటైల్ వ్యాపారం ఉంటుంది, దీని కోసం బిడ్‌ వేయవచ్చు. రెండో క్లస్టర్‌లో.. TNSI రిటైల్‌లో FRLకు ఉన్న వాటాను అమ్మకానికి పెట్టారు. మూడో క్లస్టర్‌లో.. ఫుడ్‌ హాల్ వ్యాపారం ఉంది. ఈ విధంగా మొత్తం ఐదు క్లస్టర్లుగా బిడ్స్‌ను విభజించారు.


ఫ్యూచర్‌ రిటైల్‌ నెత్తిన ఎంత అప్పు ఉంది?
ఒకప్పుడు దేశంలో రెండో అతి పెద్ద రిటైల్ స్టోర్ అయిన ఫ్యూచర్ గ్రూప్, నేడు భారీ అప్పుల్లో ఉంది. వివిధ బకాయిదార్లకు దాదాపు 21 వేల కోట్ల రూపాయల అప్పు చెల్లించాల్సి ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.