RBI MPC Meeting February 2025 Decisions: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా, 53వ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశ ఫలితాలను ఈ రోజు (శుక్రవారం, 07 ఫిబ్రవరి 2025) ప్రకటించారు. MPC సమావేశం ఫిబ్రవరి 05, 2025న ప్రారంభమైంది, ఈ రోజు ముగిసింది. సంజయ్ మల్హోత్రా ప్రసంగంలో పాలసీ రేట్‌ కటింగ్స్‌తో పాటు RBI విధాన వైఖరి, GDP వృద్ధి అంచనాలు, ద్రవ్యోల్బణ దృక్పథం వంటి కీలక అంశాలు ఉన్నాయి. ద్రవ్య విధాన కమిటీకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహిస్తున్నారు. 


2020 మే నెల తర్వాత, అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) కట్‌ చేసి, 6.25 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రెపో రేట్‌ 6.50 శాతం వద్ద ఉంది. రెపో రేట్‌ తగ్గింపుతో బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్లను తగ్గింపును ప్రారంభిస్తాయి. దీనివల్ల EMIలు తగ్గుతాయి. ఇది ప్రస్తుత రుణగ్రహీతలకు & కొత్తగా లోన్లు తీసుకునేవాళ్లకు ఆర్థిక భారం తగ్గిస్తుంది.


రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రసంగంలోని కొన్ని ప్రధాన విషయాలు:


* కమిటీ, కీలక రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది, ఇది వెంటనే అమలులోకి వస్తుంది. RBI తటస్థ ద్రవ్య విధాన వైఖరి ‍‌(Neutral monetary policy stance)ని కొనసాగిస్తుంది.


* స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్‌ను 6.00 శాతానికి సర్దుబాటు చేయగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేట్‌ & బ్యాంక్ రేట్‌ను 6.50 శాతంగా నిర్ణయించారు.


* 2024-25 సంవత్సరానికి వాస్తవ GDP వృద్ధిని సంవత్సరానికి (YoY) 6.4 శాతంగా అంచనా వేశారు. ప్రైవేట్ వినియోగం, సేవలు & వ్యవసాయంలో రికవరీ GDP వృద్ధికి మద్దతు ఇస్తాయి.


* 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వాస్తవ GDP వృద్ధిని 6.7 శాతంగా అంచనా వేశారు. త్రైమాసికం వారీగా GDP వృద్ధి అంచనాలు: Q1లో 6.7 శాతం, Q2లో 7.0 శాతం, Q3లో 6.5 శాతం & Q4లో 6.5 శాతం. రిస్క్‌లు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయని RBI గవర్నర్ చెప్పారు.


* 2024 నవంబర్-డిసెంబర్‌ కాలంలో ప్రధాన ద్రవ్యోల్బణం (Headline inflation) తగ్గింది. ఆ ఏడాది అక్టోబర్‌లోని గరిష్ట స్థాయి 6.2 శాతం నుంచి ఇది దిగివచ్చింది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం (food inflation), ముఖ్యంగా కూరగాయల రేట్లు తగ్గడం వల్ల ఇది జరిగింది. వస్తువులు, సేవలు & ఇంధనం విభాగాలలో ప్రధాన ద్రవ్యోల్బణం (Core inflation) తగ్గుముఖం పట్టింది. ఈ ధోరణులను బట్టి చూస్తే, భవిష్యత్‌లో ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. ఖరీఫ్ & రబీ పంటల అవకాశాలు, కూరగాయల ధరలు తగ్గడం ఈ అంచనాలకు మద్దతుగా నిలుస్తున్నాయి.


* CPI ఇన్‌ఫ్లేషన్‌ అంచనాలు: ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇది 4.8 శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు. Q4లో (2025 జనవరి-మార్చి కాలం) 4.4 శాతంగా అంచనా వేశారు. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా 4.2 శాతం. ఆ ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికం వారీగా ద్రవ్యోల్బణం అంచనాలు: Q1లో 4.5 శాతం, Q2లో 4.0 శాతం, Q3లో 3.8 శాతం, Q4లో 4.2 శాతం. 


మరో ఆసక్తికర కథనం: రెపో రేట్‌ కటింగ్‌ తర్వాత రూ.25 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి హోమ్‌ లోన్‌పై EMI ఎంత తగ్గుతుంది?