Home Loan EMI Saving After RBI Repo Rate Cut: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దేశంలో బ్యాంక్‌ రుణాలను చవకగా మార్చింది. ఐదు సంవత్సరాలలో (2020 మే నెల తర్వాత) మొదటిసారిగా, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ తన పాలసీ రేటు (రెపో రేటు)ను తగ్గించాలని నిర్ణయించింది. రెపో రేటును 0.25% లేదా 25 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేయాలని నిర్ణయించడంతో, ప్రస్తుత 6.50 శాతం నుంచి 6.25 శాతానికి రెపో రేట్‌ తగ్గుతుంది. ఆర్‌బీఐ తాజా ప్రకటనతో, బ్యాంకుల నుంచి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వరకు, వడ్డీ రేట్లను తగ్గించడానికి మార్గం సుగమం అయింది. అవి త్వరలోనే వడ్డీ రేట్ల కోతను ప్రకటించనున్నాయి. ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ రుణం, కారు రుణం, విద్య రుణం, వ్యక్తిగత రుణాలపైనా వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. తద్వారా, నెలనెలా చెల్లించాల్సిన EMIల బరువు తగ్గుతుంది. 

బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు కొత్తగా ఇచ్చే లోన్‌లతో పాటు, ఫ్లోటింగ్‌ రేట్‌ పాలసీ కింద ఇప్పటికే తీసుకున్న రుణాలపైనా వడ్డీ రేట్లు & EMIలు తగ్గుతాయి.

మొదట పన్ను మినహాయింపు, ఇప్పుడు వడ్డీ రేట్లుభారత ప్రజలు రోజుల వ్యవధిలోనే రెండు పెద్ద గుడ్‌న్యూస్‌లు విన్నారు. మొదట, 01 ఫిబ్రవరి 2025న, కేంద్ర బడ్జెట్‌ 2025లో ఆదాయ పన్ను ఉపశమనం పొందారు. ఇప్పుడు, రెపో రేటును తగ్గింపుతో మరో ఊరట లభించింది. ఫలితంగా, దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న మధ్య తరగతి ప్రజలకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు కేంద్ర బ్యాంక్‌ నుంచి బహుమతులు లభించాయి. 

ఐదేళ్ల తర్వాత, RBI రెపో రేటును 0.25 పాయింట్లు తగ్గించడం వల్ల ఖరీదైన EMIలు చెల్లిస్తున్న వారికి ఖచ్చితంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు, RBI రెపో రేటు తగ్గింపు తర్వాత, గృహ రుణ వడ్డీ రేట్లపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది, హోమ్‌ లోన్‌ EMI ఎంత తగ్గుతుందో చూద్దాం. 

రూ.25 లక్షల గృహ రుణంపై... ఒక వ్యక్తి రూ. 25 లక్షల గృహ రుణం తీసుకున్నాడని అనుకుందాం. అతను 8.75 శాతం వడ్డీ రేటుతో హోమ్‌ లోన్‌ తీసుకున్నాడని భావిస్తే, రూ. 22,093 EMI చెల్లిస్తాడు. ఇప్పుడు, రెపో రేటులో పావు శాతం తగ్గింపు తర్వాత, వడ్డీ రేటు 8.50 శాతానికి తగ్గుతుంది. ఫలితంగా, కొత్త EMI రూ. 21,696 చెల్లించాలి. అంటే ప్రతి నెలా రూ. 403 & ఒక సంవత్సరంలో రూ. 4,836 ఆదా అవుతుంది. 

రూ.50 లక్షల గృహ రుణంపై...ఒక వ్యక్తి, 20 సంవత్సరాలకు 9 శాతం వడ్డీ రేటుతో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకుంటే, అతను ప్రస్తుతం రూ. 44,986 ఈఎంఐ చెల్లించాలి. వడ్డీ రేటులో నాలుగో వంతు (0.25%) తగ్గింపు తర్వాత గృహ రుణ వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది, అతను చెల్లించాల్సిన EMI రూ. 44,186 అవుతుంది. అంటే ప్రతి నెలా రూ. 800 & సంవత్సరానికి రూ. 9,600 ఆదా అవుతుంది. 

రూ.1 కోటి గృహ రుణంపై...ఒక గృహ రుణ కస్టమర్ 20 సంవత్సరాల పాటు 8.75 శాతం వడ్డీ రేటుకు రూ. 1 కోటి గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. అతను రూ. 88,371 ఈఎంఐ చెల్లించాలి. వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత, గృహ రుణంపై వడ్డీ రేటు 8.50 శాతానికి తగ్గుతుంది, చెల్లించాల్సిన EMI రూ. 86,782 అవుతుంది. ఈ ప్రకారం, ప్రతి నెలా రూ. 1,589 & సంవత్సరానికి రూ. 19,068 ఆదా అవుతుంది.

మరో ఆసక్తికర కథనం: రెపో రేట్‌ 0.25 శాతం కట్‌ - ఐదేళ్లలో మొదటిసారి చవకగా మారిన రుణాలు, భారీ EMIల నుంచి ఉపశమనం