RBI MPC Meeting February 2025 Decisions: ఆశగా ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్షను భారతీయ రిజర్వ్ బ్యాంక్ నెరవేర్చింది, రుణగ్రహీతలకు మంచి గిఫ్ట్ ప్రకటించింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించిన కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI New Governor Sanjay Malhotra), రెపో రేటును నాలుగో వంతు (0.25% లేదా 25 బేసిస్ పాయింట్లు) తగ్గించాలని కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. దీంతో, ఆర్‌బీఐ రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుంది.
రెపో రేట్ కట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడంతో.. గృహ రుణాలు (Home Loans), కారు రుణాలు (Car loans), విద్యా రుణాలు (Educational loans), కార్పొరేట్ రుణాలు (Corporate loans) & వ్యక్తిగత రుణాల (Personal loans)పై వడ్డీ రేట్లు తగ్గుతాయి.
5 సంవత్సరాల్లో మొదటిసారి చవకగా మారిన రుణాలుచివరిసారిగా, 2020 మే నెల ప్రారంభంలో, కరోనా మహమ్మారి కారణంగా, RBI వడ్డీ రేట్లను తగ్గించింది, 4 శాతానికి తీసుకువచ్చింది. ఆ తర్వాత దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో 2022 మే - 2023 ఫిబ్రవరి మధ్యకాలంలో రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి కేంద్ర బ్యాంక్ పెంచింది. అంటే, 5 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది.
2024 డిసెంబర్‌లో RBI గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించిన మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం మూడు రోజుల పాటు (2025 ఫిబ్రవరి 5-7 తేదీలు) కొనసాగింది. రెపో రేటును 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు మల్హోత్రా ప్రకటించడంతో, రెపో రేటు ఇప్పుడు 6.25 శాతంగా మారింది. ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకులకు రుణాలు తీసుకోవడం చౌకగా మారింది & బ్యాంకులు ఆ ప్రయోజనాలను కొత్త రుణాలు తీసుకునే కస్టమర్లకు, పాత కస్టమర్లకు త్వరలోనే బదిలీ చేస్తాయని భావిస్తున్నారు.
ఆర్‌బీఐ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని కూడా 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించింది. అవసరమైనప్పుడు ఆర్‌బీఐ నుంచి రుణాలు తీసుకోవడంలో బ్యాంకులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది.
2025-26లో GDP వృద్ధి రేటు అంచనా 6.7 శాతంప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి, జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇంతకు ముందు దీనిని 6.6 శాతంగా అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని కూడా లెక్కగట్టింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తామని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని వాటాదారులతో సంప్రదింపులు కొనసాగుతాయన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇప్పటికీ సవాలుగా ఉందని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, ప్రపంచ పరిస్థితి భారత ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోందని తెలిపారు.
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు లక్ష్యం 4.2 శాతం2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ రేటును 4.2 శాతం లక్ష్యంగా RBI నిర్దేశించుకుంది. ద్రవ్యోల్బణ రేటుకు టాలరెన్స్ బ్యాండ్‌ను నిర్ణయించినప్పటి నుంచి సగటు ద్రవ్యోల్బణ రేటు తమ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. కొన్ని సందర్భాలలో మాత్రమే రిటైల్ ద్రవ్యోల్బణం రేటు RBI టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉందని చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: రికార్డ్‌లు తిరగరాస్తున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ