Vasamsetti Subhash Latest News: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వెలువడ్డాక అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఒకటే టాపిక్‌ నడిచింది.. అదృష్టం ఆయనదే అంటూ కేవలం పొలిటికల్‌ సర్కిల్స్‌లో మాత్రమే కాదు అన్ని వర్గాల్లోనూ ఈ మాట వినిపించింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మంత్రివర్గ ఏర్పాటులో మంత్రులు పేర్లు జాబితాలో అనూహ్యంగా ఆయనపేరు రావడం అదృష్టం అంటే మాములు అదృష్టం కాదు. మొత్తం మీద నక్కతోక తొక్కాడురా... అంటూ అన్ని వర్గాల ప్రజలు తెగ చర్చించుకున్నారు. పార్టీలోకి వచ్చి నెలరోజులు గడవకుండానే ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకుని, ఆపై ఎమ్మెల్యేగా గెలిచి, ఏకంగా మంత్రి పదవినే కొట్టేశారంటూ వస్తోన్న న్యూస్‌ నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. 

ఎప్పటి నుంచో పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి సైతం దక్కని అవకాశం దక్కిన ఆయనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌. అందుకే సుభాష్‌కు మంత్రి పదవి దక్కడం చాలా మందికి మింగుడుపడని అంశంగా మారింది. ఇదిలా ఉంటే సుభాష్‌పై పలు ఆరోపణలు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సభ్యత్వాలు, పట్టభద్రుల ఓటు నమోదు విషయంలో స్వయంగా చంద్రబాబు నుంచే అక్షింతలు పడటం తెలిసిందే. ఇప్పుడు అనుచరుల తీరు మంత్రి సుభాష్‌కు తలనొప్పిగా మారుతోంది.  

అనుచర గణంతో అన్నీ తలపోట్లే..శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్‌ స్వస్థలం అమలాపురం. ఆయన టీడీపీలోకి రాకముందు వైసీపీలో ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు మంత్రి పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నారు. పి.గన్నవరం మండల పరిధిలో ఇటీవల ఇసుక తవ్వకాలకు సంబందించి ఓ వివాదంలో ఇదే జరిగింది. తాము మంత్రి సుభాష్‌ మనుషులమని ఏం చేసుకుంటారో చేసుకోండని డైరెక్ట్‌గా తహసీల్దార్‌నే బెదిరించారట. 

అసలు విషయం ఏంటంటే... పి.గన్నవరంలో గోదావరి చెంతన ఇసుక తవ్వుతున్న జేసీబీని తహసీల్దార్‌ పల్లవి సీజ్‌ చేయించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కొందరు యువకులు వారిపై విరుచుకుపడ్డారు. మంత్రి మనుషులమని దుర్భాషలాడారని అక్కడి అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: మర్యాదపూర్వకంగా కూడా జగన్‌ను కలవని విజయసాయిరెడ్డి - ఇద్దరు ఆత్మీయుల మధ్య అంతగా చెడిందా ?

అంబాజీపేటకు చెందిన ఓదళిత యువకుడిని సుభాష్‌ అనుచరులమని కొందరు అమలాపురంలో చావబాదారు.. దీనిపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేసి సుభాష్‌ నీ ప్రవర్తన మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఇలా అనేక ఘటనలో మంత్రి సుభాష్‌ పేరుతో ముడిపడి ఉండడం ప్రజల్లో చులకన అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. 

సొంత నియోజకవర్గంలోనూ ఆరోపణలు..కార్మిక శాఖ మంత్రి సుభాష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోనూ అనుచరుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది.. ఓ భూమిని కబ్జా విషయంలో సుభాష్‌ అనుచరులు కీలకంగా ఉన్నారన్నది ఓ కుటుంబం తీవ్రంగా ఆరోపించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లపర్వం మొదలుపెట్టినట్లు మంత్రి ముఖ్య అనుచరుడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు నియోజకవర్గాల్లో ఇసుక రీచ్‌లకు సంబందించి మంత్రి సుభాష్‌ అనుచరులు దందా చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. 

వీటన్నింటికి తోడు శాఖాపరంగా కూడా సుభాష్‌పై చంద్రబాబు సానుకూలంగా లేరని చెబుతున్నారు. మంత్రిమండలి సమావేశంలో విడుదల చేసిన ర్యాంకుల్లో ఆయన ఆఖరి స్థానంలో ఉండటం దీనికి నిదర్శనం అంటున్నారు. ఇలా ఇంటా బయట తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు సుభాష్ 

Also Read: ఏపీలో మంత్రులకు ర్యాంకులు- చంద్రబాబుకు ఆరో స్థానం- పవన్‌కు 10th ప్లేస్‌- లోకేష్‌ పరిస్థితి ఏంటీ?