Union Budget 2025-26: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను విధించుకున్న నేపథ్యంలో, బడ్జెట్ 2025 కోసం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ కదలికకు ఒక రోడ్‌మ్యాప్‌గా మారుతుంది. ఆర్థిక విధానాలు, టాక్స్ రూల్స్, వ్యాపారాలు & పెట్టుబడి వాతావరణాన్ని నడిపించే సంస్కరణలను వివరిస్తుంది.
ఈ బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) చేసే కీలక ప్రకటనలను అర్థం చేసుకోవడం వల్ల, పెట్టుబడిదార్లకు భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడంలో ఒక స్పష్టత వస్తుంది.
బడ్జెట్ 2025లో గమనించాల్సిన కీలకాంశాలు ఇవి:
మూలధన సంస్కరణలు
ద్రవ్య లభ్యతను, సులభతర వాణిజ్యాన్ని పెంచే ప్రకటనలను ఈ బడ్జెట్ నుంచి ఊహించవచ్చు. IPO రూల్స్‌ను క్రమబద్ధీకరించడం, పెట్టుబడిదార్లపై భారాలను తగ్గించడం, రిటైల్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి చొరవలు స్టాక్ మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. బాండ్ మార్కెట్లను ప్రోత్సహించడం లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులను (AIFs) ప్రేరేపించే చర్యలు కూడా పెట్టుబడిదార్లను ఉత్తేజపరుస్తాయి.
రంగాలవారీ ప్రోత్సాహకాలు
పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, టెక్నాలజీ సహా అధిక వృద్ధికి అవకాశాలున్న రంగాలకు ప్రోత్సాహకాలు పెంచడం కీలకం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, R&D, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో బడ్జెట్ నిబంధనలు వృద్ధిని ఉరకలెత్తిస్తాయి, గణనీయమైన పెట్టుబడి ప్రవాహాలను ఆహ్వానిస్తాయి. రియల్ ఎస్టేట్ & మౌలిక సదుపాయాల రంగాలకు అనుకూలమైన ప్రకటనలను కూడా ఉండవచ్చు.
ఆదాయ పన్ను విధానాలు
దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను (STT) లేదా డివిడెండ్ పన్ను విధానాలలో మార్పులు పెట్టుబడిదారుల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. క్రిప్టో కరెన్సీల వంటి అసెట్ క్లాస్‌లపై పన్ను విధించడంపై స్పష్టత లభిస్తే, పెట్టుబడిదార్లకు భాగస్వామ్యంలోనూ క్లారిటీ వస్తుంది.
ఆర్థిక లోటు నిర్వహణ
స్టాక్ మార్కెట్, ఆర్థిక లోటును కూడా గమనిస్తుంది. ఎందుకంటే, ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్యం & రుణాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. లోటు నిర్వహణ కోసం అవలంబించే నిర్దిష్ట పద్ధతి ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది.
ప్రపంచ వాణిజ్యం & FDI విధానాలు
ఎగుమతులను బలోపేతం చేయడం, FDI నిబంధనలను సరళంగా మార్చడం, వాణిజ్య భాగస్వామ్యాలను విడివిడిగా చూపడం వంటివి ప్రగతిశీల విధానాలు. ప్రపంచ తయారీ & పెట్టుబడి కేంద్రంగా భారతదేశం స్థానాన్ని బలోపేతం చేస్తాయి. ఈ సంస్కరణలు విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, ప్రపంచ మూలధనాన్ని ఆకర్షిస్తాయి.
ఆర్థిక చేరిక
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక అక్షరాస్యత & ఆర్థిక సేవల విస్తృత వ్యాప్తిని ప్రోత్సహించే చొరవలను బడ్జెట్ నుంచి ఆశించవచ్చు. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని నిర్వచించడంలో ఇవి కీలకమైనవి.
స్టార్టప్‌లు, MSMEలకు మద్దతు
స్టార్టప్‌లు, MSMEలు భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయడంలో ఎవరికీ సందేహం లేదు. కాబట్టి.. పన్ను మినహాయింపులు, నిధుల మద్దతు లేదా డిజిటల్ పరివర్తన పథకాలు వంటి బడ్జెట్ ప్రోత్సాహకాలు వీటి సామర్థ్యాన్ని పెంచుతాయి.
మార్కెట్‌పై నియంత్రణ
SEBI నియంత్రణ చట్రాన్ని బలోపేతం చేసే సంస్కరణలు మార్కెట్ పారదర్శకతకు మద్దతుగా నిలుస్తాయి & పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతాయి. దానితో పాటు, ఫిన్‌టెక్ & ESG-కేంద్రీకృత పెట్టుబడులు వంటి ఎమర్జింగ్ సెక్టార్ల విధానాల్లో స్పష్టత అవసరం.
మౌలిక సదుపాయాలు & పెట్టుబడి ప్రోత్సాహకాలు
రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ బడ్జెట్ కేటాయింపులు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడమే కాకుండా సిమెంట్, ఉక్కు & లాజిస్టిక్స్ వంటి ఇతర సంబంధిత రంగాలలో పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తాయి.
ఉపాధి సృష్టి చొరవలు
ఉద్యోగ సృష్టి అవకాశాలు, ముఖ్యంగా సాంకేతికత-ఆధారిత రంగాల్లో ఉపాధి కల్పన చర్యలు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని దోహదపడతాయి. AI, ఆటోమేషన్ & పునరుత్పాదక శక్తి వంటి పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉపాధిని సృష్టించడమే కాకుండా ప్రపంచ వేదికపై మన దేశ పోటీతత్వాన్ని కూడా పెంచుతాయి.
మరో ఆసక్తికర కథనం: రియల్ ఎస్టేట్ సెక్టార్ 'పరిశ్రమ' కల నెరవేరుతుందా, బడ్జెట్ నుంచి ఈ రంగం ఏం ఆశిస్తోంది?