Konda Surekha and Seethakka visits Medaram | వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు తమ విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో భాగంగా తమ మధ్య విభేదాలు ఉన్నాయనే అపోహలను తొలగించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ ఒకే వేదిక మీద ఉన్న సభలో తమపై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. సీతక్క, కొండా సురేఖ విబేధాలు లేవని సమ్మక్క సారలమ్మల లాగా తాము కలిసి మెలిసి ఉంటామని.. అభివృద్ధిలో భాగం పంచుకుంటామని కొండా సురేఖ అన్నారు.
మహిళా మంత్రుల మధ్య విభేదాలపై క్లారిటీ
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీతక్క, కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవమని కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలగా సమ్మక్క సారక్కలాగా కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని సురేఖ అన్నారు. సీతక్క, సురేఖ లు ఒకటిగా ఉంటామని.. మా వెంట ప్రజలు, కార్యకర్తలు అండదండలుగా ఉండాలని సురేఖ అన్నారు. సీతక్క ఏజెన్సీలో, నేను నగరంలో పర్యటిస్తాం కాబట్టి ఇద్దరం కలుసుకోవడం కష్టమని ఆమె అన్నారు. పరస్పర అవగాహనతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయితే గతంలో సైతం ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరగడంపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు లేనిది పదే పదే సీతక్క, సురేఖ లు ఒక్కటే అనే చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని విమర్శలు లేక పోకపోలేదు.
సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న మంత్రులు.
ఫిబ్రవరి 12 నుంచి 15 తేదీ వరకు జరిగే మిని మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ దర్శించుకున్నారు. గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయి, డోలువాయిద్యాలతో మంత్రులకు ఘనస్వాగతం పలికారు.
వనదేవతల దర్శనం అనంతరం ఐటీడీఏ క్యాంపు ఆఫిస్ లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే మినీ మేడారం జాతర నిర్వాహణపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత మినీ మేడారంలో 15 లక్షల మంది భక్తులు వనదేవత లను దర్శించుకున్నారని, ఈ సారి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.