Tension In Hanmakonda Grama Sabha: తెలంగాణలో గత 2 రోజులుగా గ్రామసభలు కొనసాగుతుండగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) గ్రామసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలేవీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల లిస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అధికారులను ప్రశ్నించారు. అయితే, 'మీ హయాంలో ఏమీ చేయలేదని... మా ప్రభుత్వం అన్ని చేస్తుంది' అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నరు. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నాయకులు కుర్చీలు విసిరేశారు. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చ చెప్పేందుకు యత్నించారు. ఎలాంటి వివాదం రేగకుండా భారీగా మోహరించారు.
అటు, మరికొన్నిచోట్ల గ్రామసభల్లో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ పథకాల జాబితాలో తమ పేర్లు లేవని.. కొందరు లబ్ధిదారులు, ఆయా గ్రామస్థులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే, ఇది లబ్ధిదారుల జాబితా కాదని.. దరఖాస్తు చేసుకున్న వారి జాబితా అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలైన అర్హులకు లబ్ధి చేకూరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
మరోవైపు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడున్న పోలీసులు, గ్రామస్థులు అతన్ని అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గ్రామసభలో పథకాలు అర్హులకు రాలేదంటూ అధికారులు, పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు.
Also Read: Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కాన్వాయ్‌కు ప్రమాదం - ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు, మంత్రి సేఫ్