Foxconn Group Investment in Telangana: ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీ, ఐఫోన్‌ (iPhone) తయారీదారు ఆపిల్ (Apple Inc.), భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఆపిల్ ఉత్పత్తులను అసెంబుల్‌ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్, తెలంగాణలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా కొంకర్‌ కలాన్ వద్ద ఒక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు. ప్రాజెక్టులో మొదటి దశలో ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.                                                      






చైనా నుంచి బయటపడనున్న ఆపిల్‌   
కొత్త ప్లాంట్ నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను బయటకు తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం-ఫాక్స్‌కాన్ సంయుక్త ప్రకటన ద్వారా ఆపిల్‌ హామీ ఇచ్చింది. వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినందుకు తెలంగాణ రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలిపింది. కొవిడ్ మహమ్మారి, బీజింగ్‌లో కఠినమైన లాక్‌డౌన్ల కారణంగా చైనాలోని ఫాక్స్‌కాన్ కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం పడింది. దీంతో, ఆపిల్‌ ఉత్పత్తులు ఆగిపోయాయి. ఇది కాకుండా, అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతల కారణంగా, తన కంపెనీ ఉత్పత్తి ఫ్లాంట్లను చైనా నుంచి బయటకు తీసుకురావాలని ఆపిల్‌ ప్రయత్నిస్తోంది.


ఇది కూడా చదవండి: ఇవాళ బంగారం, వెండి ధరలు - కొత్త రేట్లివి


బెంగళూరులో భూమిని కొనుగోలు చేసిన ఫాక్స్‌కాన్‌
గత నెలలో, భారతదేశ రాజకీయ రాజధాని దిల్లీలో, ఆర్థిక రాజధాని ముంబైలో రెండు రిటైల్‌ స్టోర్లను ఆపిల్‌ ప్రారంభించింది. ఈ స్టోర్ల ప్రారంభోత్సవం కోసం ఆపిల్‌ CEO టిమ్ కుక్ భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో పాటు కొందరు ప్రముఖులతో సమావేశం అయ్యారు. యాపిల్, తన అధికారిక స్టోర్లను భారతదేశంలో ప్రారంభించడం ద్వారా నేరుగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలో ఫాక్స్‌కాన్ గ్రూప్ బెంగళూరులో భూమిని కొనుగోలు చేసింది. 303 కోట్ల విలువైన భూమిని కంపెనీ ఆ కొనుగోలు చేసింది. తద్వారా, బెంగళూరు ఫ్లాంట్లలోనూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. భారతదేశంలో ఐఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగిందని ఆపిల్ తన డేటాలో తెలిపింది. ఆపిల్‌ ఇండియా వృద్ధి బలంగా ఉందని ప్రకటించింది.  


ఇది కూడా చదవండి: బ్యాడ్‌ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నా క్రెడిట్‌ కార్డ్‌ పొందడం పక్కా, ఈ చిట్కా ఫాలో అవ్వండి