Palak Biryani : పాలకూర అనగానే ముఖం ముడుచుకుంటారు కానీ, దీంతో టేస్టీగా బిర్యానీ చేస్తే గిన్నె ఊడ్చేస్తారు. అంత రుచిగా ఉంటుంది పాలకూర బిర్యానీ. దీన్ని చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు సింపుల్ గా చేసేయచ్చు. ముఖ్యంగా పాలకూర తినని పిల్లలకు బిర్యానీ రూపంలో తినిపించడం సులువు. పాలకూర బిర్యానీ ఎలా చేయాలో ఓసారి చూడండి. 


కావాల్సిన పదార్ధాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
పాలకూర - రెండు కట్టలు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
నెయ్యి - రెండు టీస్పూన్లు
యాలకులు - నాలుగు
బిర్యానీ ఆకు - రెండు
కారం - ఒక స్పూను
పసుపు - అరస్పూను
పుదీనా - ఒక కట్టు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - సరిపడినన్ని
లవంగాలు - నాలుగు
జాపత్రి - రెండు
గరం మసాలా పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కొత్తిమీర - ఒక కట్ట


తయారీ ఇలా 
1. బియ్యాన్ని కడిగి కుక్కర్లో అన్నాన్ని ఉడికించాలి. ఉప్పు కూడా వేయాలి. అన్నం 80 శాతం ఉడికేలా చూసుకోవాలి.  మరో పక్క పాలకూరను కడిగి పక్కన పెట్టుకోవాలి. 
2. మిక్సీలో పాలకూర, పుదీనా, కొత్తిమీర వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.  
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టే వేసి వేయించాలి. 
4. అందులోనే దాల్చిన చెక్కలు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, జాపత్రి, కారం, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. 
5. అన్నీ వేగాక ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్టును వేసి వేయించాలి. మీడియం మంట మీద ఉడికించాలి. 
6. ఇప్పుడు కళాయిలో వండుకున్న అన్నాన్ని వేసి కాస్త నీళ్లు చిలకరించి మూత పెట్టాలి. 
7. చిన్న మంట మీద పదినిమిషాలు ఉడికించాలి. 
8. అన్నం పూర్తిగా ఉడికిపోతే బిర్యానీ రెడీ అయినట్టే. వేడి మీద అన్నం ముద్దవ్వకుండా కలుపుకోవాలి. బిర్యానీ అంతా ఆకుపచ్చని రంగులోకి మారుతుంది. 
9. చికెన్ కర్రీతో ఈ బిర్యానీని తింటే రుచి అదిరిపోతుంది. 


పాలకూర తినడం వల్ల పిల్లలకు, పెద్దలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యానికి పాలకూరలోని పోషకాలు చాలా అత్యవసరం. ఇది చర్మసంరక్షణకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యకరమైన చర్మకణాలు పెరుగుతాయి. చర్మక్యాన్సర్ నుంచి కాపాడతాయి. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అధిక బీపీ ఉన్న వారు కచ్చితంగా పాలకూర తినాలి. దీనిలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. కాబట్టి తరచూ పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎముకల ఆరోగ్యానికి, కంటి చూపుకు ఈ ఆకుకూర చాలా అవసరం. 




Also read: ప్రతిరోజూ ఒకే సమయంలో తలనొప్పి వస్తోందా? ఇలా ఎందుకు జరుగుతుంది?


Also read: ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా? ఇది రోజుకు వంద సిగరెట్లు తాగడంతో సమానం


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.