Apple iPhone 15: ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆపిల్‌ ఐఫోన్‌ 15 (Apple iPhone 15) మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ మన దేశంలోనే తయారవుతోంది. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఉన్న ఫ్లాంట్‌లో, ఐఫోన్‌ 15 అసెంబ్లింగ్‌ ప్రాసెస్‌ను ఫాక్స్‌కాన్‌ స్టార్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.


ఆపిల్‌ ఐఫోన్లను కాంట్రాక్టు పద్ధతిలో తయారు (అసెంబ్లింగ్‌) చేసే కంపెనీల్లో ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ‍‌(Foxconn Technology Group) ఒకటి. గతంలో చైనాలో ఉన్న ఫ్లాంట్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో ఐఫోన్లను ఈ కంపెనీ తీసుకువచ్చేది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం, మాన్యుఫాక్చరింగ్‌ బేస్‌ను వికేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఫాక్స్‌కాన్‌, ఇండియా నుంచి ఉత్పత్తిని పెంచుతోంది. భారతదేశంలో ఐఫోన్‌ల ఉత్పత్తిని వేగవంతం చేసే స్ట్రాటెజీలో ఇదొక భాగం. 


చైనీస్ ఫ్యాక్టరీల నుంచి ఐఫోన్‌ 15 యూనిట్లు బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇండియా ఫ్లాంట్‌ నుంచి కూడా డెలివెరీ ఇవ్వడానికి ఫాక్స్‌కాన్‌ సిద్ధంగా ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. ఇండియాకు దిగుమతుల రూపంలో వచ్చే స్పేర్‌ పార్ట్స్‌ను బట్టి ఐఫోన్‌ 15 యూనిట్ల అసెంబ్లింగ్‌ సైజ్‌ ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు, ఫాక్స్‌కాన్‌ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇబ్బందులు లేకుండా ఏ స్థాయి వరకు పెంచగలరన్న విషయంపైనా ఐఫోన్‌ 15 తయారీ విజయం ఆధారపడి ఉంటుంది.


ఐఫోన్‌ 15 లాంచింగ్‌ డేట్‌
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్‌ లవర్స్‌ సహా టెక్నాలజీపై ఇంట్రెస్ట్‌ చూపే ప్రతి వ్యక్తి ఆపిల్‌ ఐఫోన్‌ 15 లాంచింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఫోన్‌ను వచ్చే నెల (సెప్టెంబరు) 12న గ్లోబల్‌గా లాంచ్‌ చేసే అవకాశం ఉంది. 


ఐఫోన్‌ 15లో చాలా మార్పులు
ఈ మోడల్‌లో కెమెరా సిస్టమ్‌ను భారీగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు, ప్రో వేరియంట్స్‌లో అడ్వాన్స్‌డ్‌ 3-నానోమీటర్ A16 ప్రాసెసర్‌ను అమరుస్తున్నట్లు సమాచారం.


ఆపిల్‌ ఐఫోన్‌ 13 మోడల్‌ వరకు, చైనాలో ఉత్పత్తి ప్రారంభమైన ఆరు నెలల తర్వాతే ఇండియాలో అసెంబ్లింగ్‌ స్టార్‌ అయ్యేది. అది కూడా తక్కువగా జరిగేది. ఐపోన్‌ 14 నుంచి పరిస్థితి మారింది. గ్లోబల్‌గా వివిధ దేశాల్లో ఐఫోన్‌ 14 యూనిట్ల డెలివెరీలు ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే భారత్‌లోనూ అసెంబ్లింగ్‌ ప్రారంభమైంది. ఐఫోన్‌ 15 విషయంలోనూ ఇదే జరుగుతోంది. 


మన దేశంలో ఆపిల్‌ కోసం ఐఫోన్లను అసెంబుల్‌ చేసేది ఫాక్స్‌కాన్‌ మాత్రమే కాదు. పెగాట్రాన్‌ కార్పొరేషన్‌ (Pegatron Corp), టాటా గ్రూప్‌ కొనుగోలు చేస్తున్న విస్ట్రాన్‌ కార్పొరేషన్‌ ‍‌(Wistron Corp) కూడా ఐఫోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇండియాలో ఉన్న వీటి ఫ్లాంట్లలో ఐఫోన్‌ 15 అసెంబ్లింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ అవుతుందని తెలుస్తోంది. 


హైదరాబాద్‌లో ఆపిల్‌ 'ఎయిర్‌పాడ్స్‌' తయారీ
ఆపిల్‌ కంపెనీ, హైదరాబాద్‌లో వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను తయారు చేయనుందని తెలిసింది. ఫాక్స్‌కాన్‌ ఫ్లాంట్‌లోనే ఆపిల్‌ 'ఎయిర్‌పాడ్స్‌' ప్రొడక్షన్‌ ఆరంభమవుతుందని సమాచారం. మన దేశంలో ఐఫోన్‌ తర్వాత ఆపిల్‌ తరపున ఉత్పత్తి అవుతున్న రెండో ప్రొడక్ట్‌ ఇదే. 'ఎయిర్‌పాడ్స్‌' ఉత్పత్తి కోసం హైదరాబాద్‌ ప్లాంట్‌లో 400 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ ఆమోదం తెలిపింది. 2024 డిసెంబర్‌లో ఇక్కడ ప్రొడక్షన్‌ మొదలవుతుందని అంచనా. 


మరో ఆసక్తికర కథనం: బంపర్ ఆఫర్‌ ఇచ్చిన గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial