Saranya Murder Case: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే బి క్యాబిన్ వద్ద కలకలం రేపిన వివాహిత శరణ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. 9 మంది నిందితులను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ డీసీపీ సుధీర్ కేకన్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. సయ్యద్, శరణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత కాలానికి సయ్యద్ వేరే అమ్మాయితో పరిచయం పెంచుకొని సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయంపై శరణ్య, సయ్యద్ మధ్య తరచూ గొడవలు జరిగేవి. 


దీని కారణంగానే తరచూ శరణ్యను సయ్యద్ వేధించేవాడు. విడాకులు ఇవ్వాలని చిత్ర హింసలు పెట్టేవాడు. అయినా శరణ్య విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో శరణ్యను చంపాలని సయ్యద్ నిర్ణయించుకున్నాడు. స్నేహితులతో కలిసి పథకం రచించాడు. శరణ్యను చంపడానికి తన స్నేహితుడు సాయికుమార్‌తో 9 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. సయ్యద్ ఇచ్చిన హింట్స్‌తో సాయికుమార్ మరికొంత మందితో కలిసి ఆగస్టు 10వ తేదీన శరణ్యను కత్తితో నరికి హత్య చేశాడు. 


దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సయ్యద్‌ను తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. నిందితుల కోసం గాలింపు చేపట్టి బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, నాలుగు వేల రూపాయలు స్వాధీన పరచుకుని రిమాండ్‌కు తరలించారు.


ప్రేమ వివాహమే
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్ వాడకు చెందిన బత్తిని శరణ్య, రాళ్లపేటకు చెందిన సయ్యద్ జియా ఉల్ హక్ 2009 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సయ్యద్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా పక్క రాష్ట్రం వెళ్లగా కాంచన్ అనే మరో యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భార్య శరణ్యకు తెలియడంతో నిలదీసింది. 


ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. కాంచన్‌ అనే యువతే తన భార్య అని శరణ్యతో తనకు ఎలాంటి సంబందం లేదని విడాకులు ఇవ్వాలంటూ వేధించేవాడు. వేధింపులు తట్టుకోలేక శరణ్య తన 9 ఏళ్ల కూతురు మనస్వికతో కలిసితో పుట్టింటికి‌ వచ్చేసింది. అనంతరం మంచిర్యాల పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తూ జీవిస్తోంది. అనంతరం శరణ్య భర్తపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టడంతోపాటు కోర్టులో డీవీసీ కేసు పెట్టింది. 


హత్య చేశారిలా!
భార్య శరణ్యపై పగ పెంచుకున్న సయ్యద్‌ జియా ఉల్‌ హక్‌ ఇటీవల పలుమార్లు విడాకులు ఇవ్వాలని ఫోన్‌ చేసి బెదిరించాడు. శరణ్య ఒప్పుకోకపోవడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. జూన్‌ 12న బక్రీద్‌ సందర్భంగా మంచిర్యాలకు వచ్చిన సయ్యద్‌ జియా ఉల్‌ హక్‌ తన స్నేహితుడు సాయికుమార్‌తో తన భార్య శరణ్యను చంపివేయాలని అందుకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. సాయికుమార్‌ తనకు తెలిసిన పట్టణంలోని ఆండాలమ్మ కాలనీలో ఉండే దారంగుల రాజ్‌కుమార్‌, దారంగుల శివలు మర్డర్‌ చేయడానికి ఒప్పుకున్నాడని తెలిపాడు. 


మొత్తం రూ.9 లక్షలకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్సుగా సయ్యద్‌ జియా ఉల్‌ హక్‌ రాజు, శివకు రూ.1.50 లక్షలు, సుపారీ కుదిర్చినందుకు సాయికుమార్‌కు రూ.50 వేలు ఇచ్చాడు. జులై 11న కత్తులు కొనుగోలు చేయడానికి రూ. 10 వేలు పంపించాడు. రాజు, శివ మంచిర్యాలకు చెందిన చంద్రగిరి సాయికుమార్‌, వేముల సాయి, మంచర్ల రవితేజ, అమేర్‌ గౌరీ అలియాస్‌ బబ్లు, పల్లికొండ శివ, కుందారంకు చెందిన పల్లికొండ అనిల్‌లతో హత్య చేయడంలో తనకు సహకరిస్తే ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇస్తానని ఆశ చూపారు. 


నిందితులందరూ కలిసి శరణ్య ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లే సమయం, తిరిగి ఇంటికి వచ్చేసమయం గుర్తించారు. ఈ నెల 10న సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి వెళ్లే దారిలో రైల్వే క్యాబిన్‌ వద్ద ఒంటరిగా పట్టాలు దాటింది. అక్కడే చెట్ల పొదల్లో దాక్కుని ఉన్న రాజు, శివ బయటకు వచ్చి కత్తులతో మెడ, చేతులపై నరికారు. శివ అక్కడ ఉన్న రెండు పెద్ద బండరాళ్లతో శరణ్య తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.