Tiger Trapped In Cage At Tirumala:


తిరుమల : అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో తిరుమలలో మరో చిరుత చిక్కింది. మూడు రోజులు కిందట బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే బోనులో మరో చిరుత చిక్కింది. చిరుతలను బంధించడానికి అటవీ శాఖ అధికారులు మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేయడం తెలిసిందే. మోకాలి మిట్ట, లక్ష్మినరసింహ స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేశారు. లక్ష్మినరసింహ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత చిరుత చిక్కినట్లు అధికారులు చెబుతున్నారు. 50 రోజులు వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించారు. చిరుతను టిటిడి అటవీ శాఖ అధికారులు ఎస్వీ జూపార్క్ కు తరలించనున్నారు. 


గత వారం తిరుమల శ్రీవారి దర్శనానికి నెల్లూరు నుంచి వచ్చిన చిన్నారిపై నడకమార్గంలో చిరుత దాడిచేసి చంపేసింది. అనంతరం అటవీశాఖ అధికారులు మూడు చోట్ల బోనులు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మూడో రోజు చిరుత బోనుకు చిక్కింది. దాన్ని అడవిలో వదిలేశారు. తాజాగా బుధవారం అర్దరాత్రి దాటిన తరువాత నరసింహ స్వామి ఆలయం సమీపంలో వేటకు వచ్చిన చిరుత అక్కడ ఏర్పాటు చేసిన బోనులో చిక్కినట్లు అధికారులు తెలిపారు.  


వైల్డ్ లైఫ్ డిఏఫ్ఓ ఏమన్నారంటే.. 
ప్రస్తుతం ఆడచిరుత బోనుకు చిక్కిందని తిరుపతి వైల్డ్ లైఫ్ డిఏఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు. దీనిని ఎస్వీ జూపార్క్ కు తరలిస్తున్నాం అన్నారు. చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్ళు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటాం.. ఆ తర్వాత ఫారెస్ట్ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకూ జూలో ఉంచాలా లేక ఫారెస్ట్ లో ఉంచాలా అన్నది నిర్ణయం తీసుకుంటామన్నారు. చిరుతల జాడ కోసం దాదాపు 320 ట్రాఫ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.


ఎస్వీ యూనివర్సిటీలో చిరుత భయం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న విద్యార్ధులు.. 
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత భయంతో విద్యార్ధులకు తీరని సమస్యగా మారింది. గత వారం రోజులుగా ఇంజనీరింగ్ కాలేజీ సమీప ప్రాంతంలో చిరుత సంచరిస్తుండడంను గుర్తించిన విద్యార్ధులు రాత్రిలో క్యాంటీన్ కు వెళ్ళేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరుత ఎటు నుండి వచ్చి తమపై దాడి చేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.. ఒక్కో సారి క్యాంటీన్ కు వెళ్ళకుండా హాస్టల్స్ లోనే పస్తులు సైతం ఉండిపోతున్నారు.. చిరుత సంచారం విషయంను ఎస్వీ యూనివర్సిటీ విద్యార్ధుల దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం పట్టించుకోక పోవడంతో విద్యార్ధులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. 


తిరుమలలో చిక్కిన చిరుత- చిన్నారిని చంపిన మ్యాన్ ఈటర్‌ ఇదేనా!
ఓ చిన్నారి ప్రాణం తీసి... భక్తులను భయభ్రాంతులకు గురిచేసి, అధికారులను పరుగులు పెట్టించిన మ్యాన్ ఈటర్ చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. మూడు రోజులు ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన చిరుతను తిరుమల తిరుపతి దేవస్థాన అటవీ అధికారులు ఆగస్టు 13 అర్ధరాత్రి బంధించారు. రెండు రోజులపాటు తిరుమలకు కాలి నడకన వెళ్లాలంటే టెన్షన్ టెన్షన్. మనిషి రక్తం రుచిమరిగిన చిరుత ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో అన్న ఆందోళన ఉండేది. దీంతో భక్తులకు హాని లేకుండా తగిన జాగ్రత్తలు టీటీడీ తీసుకున్నప్పటికీ భయం మాత్రం వదల్లేదు. అందుకే రెండు రోజుల పాటు శ్రమించిన అధికారులు చిరుతను బంధించారు. చిన్నారిని చంపినప్పటి నుంచి ఆరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.