Rains in AP and Telangana:
హైదరాబాద్: వర్షాలు కురవక తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. హైదరాబాద్ నగరంలో బుధవారం కొన్ని ఏరియాలలో చినుకులు పడగా, గురువారం నుంచి మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వరినాట్లు వేస్తున్న రైతులు, ఇదివరకే నాట్లు వేసి వర్షాల కోసం చూస్తున్న రైతులకు ఊరటనిచ్చే అంశం ఇది. అసలే వర్షాలు లేకపోవడంతో ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగానే ఉంది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుందని, దీని ప్రభావంతో హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం మరో రెండు రోజుల్లో లేక 18వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో 3 రోజులు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు 17న హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వాన పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనం మారితే ఆగస్ట్ 18 నుండి వర్షాలు పెరుగుతాయి, ఆగస్ట్ 19, ఆగస్ట్ 20 తేదీల్లో ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు మూడో వారంలో వర్షాలు తగ్గితే పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
(Photo: Twitter/@balaji25_t)
మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం చిరుజల్లుల నుంచి మోస్తరు వర్ష సూచన చేయగా.. రాష్ట్రంలో శుక్ర, శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. చెరువులు, జలాశయాల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సమయంలో వాటి చుట్టుపక్కల గ్రామాలవారు అప్రమత్తంగా ఉండాలి.
ఏపీలో ఓవైపు వర్షాలు, అక్కడ భానుడి భగభగలు..
సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉండటంతో మే నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. విశాఖలో అయితే ఆ మధ్య 100 ఏళ్లలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు కావడం తెలిసిందే. ఓవైపు భానుడు ప్రతాపం చూపుతున్నా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ అంతర కర్ణాటక నుంచి కామోరిన్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. నైరుతి దిశ నుంచి, పశ్చిమ దిశల నుంచి ఏపీ, యానాం వైపు గాలులు వీచనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు యానాంలో ఆగస్టు 20వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్ష సూచన ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులు మోస్తరు వర్షాలున్నాయి. సీమలో చిత్తూరు, దాని సరిహద్దు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురనుంది. వాన లేని చోట ఉక్కపోత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.