Food Inflation: దేశవ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగల్లో ఒకటైన దసరా మరికొన్ని రోజుల్లోనే ఉంది. ఆ తర్వాత దీపావళి వస్తుంది. ఈ పండుగల సమయంలో ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు ఉంటాయి. పండుగ ప్రత్యేక వంటల వల్ల వంట సరుకులకు డిమాండ్‌ పెరిగి, కొరత ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీనివల్ల రేట్లు పెరుగుతాయి. 


ప్రస్తుత ఫెస్టివ్‌ సీజన్‌లో డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై జరిగేలా, తద్వారా రేట్లకు కళ్లెం వేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి, పండుగల సీజన్‌లో ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వంట నూనెలు, గోధుమ పిండి, శనగ పిండి, బియ్యం, పంచదార రేట్లు పెరగకపోవచ్చు. కూరగాయల ధరలు కూడా అదుపులోనే ఉండే ఛాన్స్‌ ఉంది.


వంట సరుకులను అక్రమంగా నిల్వ చేసి, కృత్రిమంగా రేట్లు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, సరఫరాలు పెంచేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. ఎగుమతుల నిషేధం, స్టాక్ హోల్డింగ్‌పై పరిమితిని విధించడం దీనిలో భాగం. అంతేకాదు... ఫెస్టివ్‌ సీజన్‌ కోసం గోధుమలు, బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలను ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) గోడౌన్ల నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ చర్యల ఫలితంగా సప్లైస్‌, రేట్లు కంట్రోల్‌లోకి వచ్చాయి.


చక్కెర సహా వీటి ధరలు పెరగకపోవచ్చు
సాధారణంగా, పండుగ సీజన్ వచ్చేసరికి చక్కెర సహా కొన్ని ఆహార పదార్థాల ధరలు సామాన్యుడికి అందకుండా పరుగులు పెడుతుంటాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, ఈసారి పరిస్థితి అలా ఉండకపోవచ్చు. ఈ పండుగ సీజన్‌లో  గోధుమ పిండి, శనగపిండి, పాల ఉత్పత్తులు, వంట నూనెలు, పంచదార ధరలు స్థిరంగా ఉంటాయని అంచనా.


తగ్గిన చక్కెర సప్లై
దేశంలో చక్కెర సరఫరా తగ్గింది. కాబట్టి, దసరా నవరాత్రుల సమయంలో షుగర్‌ రేటు పెరగకపోయినా, తగ్గదని మాత్రం మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ప్రభుత్వం కొత్త చక్కెర నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీపావళి వచ్చే నాటికి పంచదార ధర పెరిగే అవకాశం లేకపోలేదు. దీనిని కూడా అడ్డుకోవడానికి, పంచదార ఎగుమతులపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై అతి త్వరలోనే ఆదేశాలు వస్తాయని గవర్నమెంట్‌ అఫీషియల్స్‌ చెప్పారు. 


మన దేశంలో, అక్టోబర్‌ 1 నుంచి షుగర్‌ సీజన్‌ ప్రారంభమైంది. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి రుతుపవనాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. సగటు వర్షపాతం కూడా నమోదవ్వలేదు. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. ఫలితంగా చెరకు ఉత్పత్తి, షుగర్‌ ప్రొడక్షన్‌ తగ్గే ప్రమాదం ఉంది. ఈ రిస్క్‌ నుంచి దేశ ప్రజలను తప్పించడానికి, విదేశాలకు చక్కెర ఎగుమతి కాకుండా నిషేధం విధించబోతోంది. ఫలితంగా, ఆ చక్కెర మొత్తం దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది. 


పాల ఉత్పత్తుల ధరలు కూడా స్థిరం
పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అక్షలీ షా చెబుతున్న ప్రకారం, గత సంవత్సరం బాగా పెరిగిన పాల ఉత్పత్తుల రేట్లు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. పండుగల వల్ల నెయ్యి, పాలు, ఇతర పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. 


మరో ఆసక్తికర కథనం: ఫలితాలు ప్రకటిస్తూనే డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చిన టీసీఎస్‌, ఐటీ సెక్టార్‌తో జాగ్రత్త!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial