Food inflation fears abate as cooking oils and grains plummet : ప్రజలకు ఊరట కలిగించే విషయం! రానున్న రోజుల్లో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు మరింత తగ్గనున్నాయి. సరఫరా పెరగడంతో వంట నూనె, గోధుమలు సహా చాలా సరకుల ధరలు తగ్గుముఖం పడతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లలో కమొడిటీల కొనుగోళ్లు తగ్గిపోవడం ఇందుకు మరో కారణం.
ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే పామ్ ఆయిల్ ఏప్రిల్‌లో రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పుడది 45 శాతం మేర తగ్గి ఈ ఏడాదిలోనే అత్యంత బలహీన స్థాయిల్లోకి వచ్చింది. ఇక మార్చిలో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన గోధుమల ధర ఇప్పుడు 35 శాతం తగ్గింది. ఏడాదిలోనే గరిష్ఠంగా ఉన్న మక్కజొన్న 30 శాతం పడిపోయింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో పొద్దు తిరుగుడు నూనె, ఇతర పప్పుల సరఫరాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. దాంతో అంతర్జాతీయంగా ఆహార కొరత ఏర్పడింది. పేద దేశాల్లో ప్రజలు ఆకలితో విలవిల్లాడారు. ప్రస్తుతం యుద్ధ తీవ్రత తగ్గిపోవడంతో ధరలు తిరిగి సాధారణ స్థాయికి వస్తున్నాయి.
అమెరికాలో వడ్డీరేట్లు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు బుల్లిష్ పొజిషన్లు తీసుకోవడం తగ్గించేశారు. సోయాబీన్ ఆయిల్‌పై నెట్ బుల్లిష్ బెట్లు 23 నెలల కనిష్ఠానికి తగ్గిపోయాయి. గోధులపై నాలుగు నెలల కనిష్ఠం, మక్కజొన్నపై ఎనిమిది నెలల కనిష్ఠానికి ఇవి చేరుకున్నాయి.
కౌలాలంపూర్ మార్కెట్లో బుధవారం టన్ను పామ్ ఆయిల్ ధర 10 శాతం పతనమై 3757 స్థాయికి చేరుకుంది. చికాగోలో సోయాబీన్ ఆయిల్, మక్కలు, గోధుమల ధర తగ్గిపోయింది. పామ్ ఆయిల్ ఫ్యూచర్స్ తగ్గిపోవడంతో ఇండోనేషియా ఎగుమతులపై నిషేధం ఎత్తివేసింది. మలేసియాలోనూ ఉత్పత్తి సాధారణ స్థాయికి పెరిగింది. బయో డీజిల్ గిరాకీ తగ్గిపోయింది.
'క్రూడ్ పామాయిల్‌లో భారీ నష్టాలు, సోయాబీన్ ఆయిల్ ధర తగ్గుదల పామ్ ఆయిల్ ఎగుమతులు, ఉత్పత్తి, సరఫరాకు డిమాండ్ పెంచాయి' అని సింగపూర్‌లోని పామ్ ఆయిల్ అనలిటిక్స్ యజమాని సతీశ్ అంటున్నారు. ఎగుమతులపై నిషేధాలు ఎత్తేయడంతో చైనా, భారత్ భారీ స్థాయిలో దిగుమతులు చేసుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు కన్నా తక్కువ స్థాయిలో ఇండోనేషియా, మలేషియా క్రూడ్ పామ్‌ఆయిల్ రిఫరెన్స్ రేటు ఉందని అంటున్నారు.
అమెరికాలో మక్కజొన్న పంట సైతం చేతికి రానుంది. రాబోయే రెండు నెలల కాలం ఇందుకు అత్యంత కీలకం. అనుకున్న స్థాయిలో పంట వస్తే ధరలు ఇంకా తగ్గుతాయి.