కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం కరీంనగర్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎల్పీజీ ధరల పెరుగుదలకు నిరసనగా కట్టెల పొయ్యి మీద వంట కార్యక్రమం చేపట్టారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రజలను మభ్యపెడుతూ సామాన్య ప్రజలపై తీవ్రమైన ధరల భారాలు వేస్తున్నారని జిల్లా సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం కరీంనగర్ జిల్లా, నగర కార్యదర్షులు, మిల్కురి వాసుదేవరెడ్డి, గుడికందుల సత్యం మీడియాతో మాట్లాడుతూ.. అచ్చే దిన్ ఆగయా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (LPG), నిత్యవసర సరుకుల ధరలు పెంచుతున్నారని చెప్పారు. వాస్తవానికి ఇవి అచ్చే దిన్ కాదని ప్రజలకు సచ్చే దినాలు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ అధికారంలోకి రాకముందు కేవలం 400/- రూపాయలు ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర నేడు 1105/- రూపాయలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశం కోసం, ధర్మం కోసం ధరల భారమా..!
దేశం కోసం, ధర్మం కోసం అంటూ సామాన్య ప్రజలపై రోజురోజుకూ ధరల భారాన్ని పెంచడం భావ్యం కాదన్నారు. సామాన్యుడి కనీస ఆదాయ పరిమితులను దృష్టిలో ఉంచుకోకుండా, కేంద్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఇంధన ధరలతో పాటు నిత్యావసర ధరలు, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నారని విమర్శించారు. మూడు రోజుల కిందట ప్రధాని మోదీ తెలంగాణకి వచ్చారని, రాష్ట్రానికి నిధులు కేటాయించకపోగా అదనంగా ప్రజలపై భారాలు వేస్తూ ఢిల్లీకి వెళ్లిపోయారని పేర్కొన్నారు.
కార్పొరేట్ల చేతికి దేశ సంపద..
దేశంలో చాలా వర్గాల వారు కరోనా తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం.. దేశ సంపదనంతా కార్పొరేట్స్, వ్యాపారవేత్తలైన అంబానీ, అదానీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీలకు కట్టబెడుతున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. ఓవైపు భారత్ మాతాకీ జై అంటూనే, మరోవైపు దేశంలో మంచి లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన LIC, BSNL, బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు, విమానాశ్రయాలను కార్పోరేట్ శక్తులకు అమ్మేస్తున్నారంటూ మండిపడ్డారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారే కానీ ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. ఇక ఆర్భాటంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ.. ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టారని, కొత్తగా యువతకు ఉపాధి కల్పించలేదన్నారు. పైగా ఎన్నడు లేని విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రోజురోజుకూ పెంచుతూ పేద , సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Gas Cylinder Price Hike: షాకింగ్ న్యూస్! గ్యాస్ సిలిండర్ ధరపై మళ్లీ బాదుడు, ఈ సారి ఎంతంటే