Tax Regime in India: ఆదాయ పన్ను వ్యవస్థను మరింత సరళీకరించేందుకు, ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. మినహాయింపుల్లేని సరికొత్త పన్ను వ్యవస్థను సమీక్షించనుందని తెలిసింది. భవిష్యత్తులో ఎలాంటి చిక్కుల్లేని, గందరగోళానికి తావివ్వని, మినహాయింపుల్లేని వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది.
ఇందులో భాగంగానే 2020-21లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపన్ను వ్యవస్థను తీసుకొచ్చింది. డిడక్షన్లు, మినహాయింపుల్లేని వ్యవస్థను ప్రవేశపెట్టింది. తక్కువ పన్ను రేట్లను అమలు చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇష్టం మేరకు కొత్త లేదా పాత వ్యవస్థను ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఆదాయపన్ను చట్టాన్ని సరళీకరించి పన్ను చెల్లింపు దారులకు ఊరటనివ్వాలన్నదే దీని వెనక ఉద్దేశం.
కొత్త పన్ను వ్యవస్థ ద్వారా ఆదాయపన్ను చెల్లించేందుకు యువత ముందుకొస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విద్యా రుణాలు తీసుకొని కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు కొత్త టాక్స్ రెజిమ్‌నే ఎంచుకుంటున్నారని పేర్కొంది. వారికి ఎలాంటి మినహాయింపులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతోంది. తక్కువ పన్ను శ్లాబులే అమలు చేస్తుండటం కొత్త పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చిందని తెలిపింది.
గతంలో కార్పొరేట్ పన్ను వ్యవస్థలోనూ ప్రభుత్వం ఇలాంటి మార్పే తీసుకొచ్చింది. 2019, సెప్టెంబర్లో మినహాయింపులు తొలగించి, పన్ను రేట్లను తగ్గించి కొత్త కార్పొరేట్ టాక్స్ సిస్టమ్ అమలు చేసింది. అప్పటికే ఉన్న కంపెనీలకు కనీస కార్పొరేట్ పన్నును 30 నుంచి 22 శాతానికి తగ్గించింది. 2019, అక్టోబర్ 1 తర్వాత మొదలైన కొత్త తయారీ కంపెనీలు, 2024, మార్చి 31కి ముందు సేవలు మొదలు పెట్టే కంపెనీల పన్నును 25 నుంచి 15 శాతానికి తగ్గించింది. ఈ కొత్త పన్నుల వ్యవస్థను ఎంచుకొనే కంపెనీలు మినహాయింపులు, ప్రోత్సాహకాలను మర్చిపోవాల్సి ఉంటుంది.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం తీసుకొచ్చిన కొత్త పన్ను వ్యవస్థలో రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2.5-5 లక్షల మధ్య ఆదాయం ఉంటే 5 శాతం పన్ను చెల్లించాలి. రూ.5-7.5 లక్షల వారికి 10 శాతం, రూ.7.5-10 లక్షల వారికి 15 శాతం, రూ.10-12.5 లక్షల వారికి 20 శాతం, రూ.12.5-15 లక్షల వారికి 25 శాతం, రూ.15 లక్షల పైగా ఆదాయం వస్తే 30 శాతం వరకు పన్ను చెల్లించాలి.