మనదేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆహారాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్పెషల్ వంటకాలు పాపులర్ అవుతాయి. అలాగే ఈ పాన్ కూడా చాలా ప్రత్యేకం. ఈ కిళ్లీ పేరు కోహినూర్. మహారాష్ట్రాల్లోని ఔరంగాబాద్‌లోని తారా పాన్ సెంటర్ అనే దుకాణంలో మాత్రమే అమ్ముతారు. 48 ఏళ్ల నుంచి వారు ఈ కిళ్లీని అమ్ముతున్నారు. దాదాపు 51 రకాల కిళ్లీలను వీరు తయారు చేసి అమ్ముతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దీని కోసం వస్తారు. ముఖ్యంగా కోహినూర్ పాన్ కోసమే వచ్చి వెళతారు. ఇది లైంగిక శక్తిని పెంచుతుందని, కామోద్ధీపనలా పనిచేస్తుందని నమ్ముతారు. అందుకే పెళ్లయిన జంటలకు వీటిని మొదటి రాత్రికి అందిస్తారు. ఈ దుకాణం యజమాని పేరు మహమ్మద్ సర్ఫుద్దీన్ సిద్ధిఖీ. 


ధర ఎంతంటే...
అసలే ప్రత్యేకమైన కిళ్లీ, అందునా స్పెషల్ రాత్రి కోసం తయారుచేసినది కదా, ఇక ఖరీదు ఎందుకు తక్కువ ఉంటుంది? ఒక్కో కిళ్లీ రూ.5000. దీన్ని ఆ ప్రాంతంలో ఇండియన్ వయాగ్రాగా పిలుస్తారు. ఈ కిళ్లీ ఒకసారి వేసుకుంటే దీని ప్రభావం కనీసం మూడు రోజుల పాటూ ఉంటుందట. నవ దంపతులు ఇద్దరికీ రెండు కిళ్లీలను అందిస్తారు. గతంలో దీన్ని నవాబుల కోసం తయారు చేసేవారని అందుకే దీనికి కోహినూర్ అనే పేరు పెట్టినట్టు చెబుతారు. 


ఎలా తయారు చేస్తారు?
దుకాణందారులు దీని తయారీలో వాడే పదార్థాలు చెప్పడానికి నిరాకరించారు. అక్కడ వారి నమ్మకం ప్రకారం ఈ పాన్ లో తేనె, అంబర్ అనే పదార్థం, గుల్కంద్, జింక కస్తూరి కలుపుతారు. అలాగే కుంకుమపువ్వు, గులాబీ ఆకులు, పశ్చిమబెంగాల్ లో మాత్రమో దొరికే అరుదైన లిక్విడ్ కలుపుతారని కూడా చెబుతారు. ఆ పాన్ పై బంగారు పూత పూసిన ఆకును కప్పి ఇస్తారు. దీనిలో కామోద్దీపన కోసం ఒక రహస్య పదార్థం కలుపుతారు, అది దుకాణం యజమానికి, ఆమె తల్లికి తప్ప ఇంకెవరికీ తెలియదు. చివరకి ఆ దుకాణంలో పనిచేసేవారికి కూడా తెలియదు. ఈ 'కోహినూర్ పాన్' 12 రకాల పదార్థాలతో తయారు చేస్తారు, అవన్నీ కూడా కామోద్దీపనలను కలిగి ఉంటాయని అంటారు. ఆడవారికి, మగవారికి వేరు వేరుగా కోహినూర్ కిళ్లీని తయారుచేస్తారు. 


ఈ పాన్ పెళ్లి సీజన్లో అధికంగా అమ్ముడుపోతుంది. ఆ పాన్ ప్యాకేజింగ్ కూడా చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అందులో చిన్న బాటిల్ అత్తరు కూడా ఉంటుంది. ఆ అత్తరును శరీరానికి రాసుకోవడం లేదా బెడ్ షీట్లు, దిండ్లకు పూయడం ద్వారా ఒక రకమైన మత్తు వాసనను ఆస్వాదించవచ్చు.  మహారాష్ట్రలో ఉన్న వారికి ఈ పాన్ పరిచయమే. అందరూ దూరతీరాల నుంచి వచ్చి మరీ దీని రుచి చూసి వెళతారు.



Also read: ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి


Also read: అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్, దానికి ఓ నగరం పేరు ఎలా వచ్చింది?