FIIs: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు, ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో డీకప్లింగ్‌ (decoupling) అయ్యాయి. అంటే, మిగిలిన అన్ని మార్కెట్లు ఒకలా స్టెప్స్‌ వేస్తుంటే ఇండియన్‌ మార్కెట్లు వాటికి విరుద్ధంగా డాన్స్‌ చేస్తున్నాయి. 2022లో అన్ని ప్రధాన ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనమైతే, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు విపరీతంగా రాణించాయి. 2023లోనూ ఈ డీకప్లింగ్ కంటిన్యూ అవుతోంది, కాకపోతే సీన్‌ రివర్స్ మోడ్‌లో ఉంది. 


ఈ సంవత్సరం, ప్రధాన ప్రపచం మార్కెట్లన్నీ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, నిఫ్టీ మాత్రం గరిష్ట స్థాయుల నుంచి క్రమంగా మెట్లు దిగుతోంది. దీనికి ప్రధాన కారణం విదేశీ మదపుదార్లు (foreign institutional investors లేదా FIIs). నిఫ్టీ50 ఇండెక్స్‌ నుంచి $4 బిలియన్లకు పైగా విలువైన షేర్లను విదేశీ సంస్థలు అమ్మేశాయి. పైగా.. నిప్టీలో షార్ట్‌ పొజిషన్లను, ఇతర దేశాల మార్కెట్లలో లాంగ్‌ పొజిషన్లను బిల్డ్‌ చేస్తున్నాయి.


ఇక్కడి ఇలా - అక్కడ అలా
2023 క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటి వరకు, నిఫ్టీ50 విలువ దాదాపు 2% పడిపోయింది. ఇదే సమయంలో, అభివృద్ధి చెందిన & అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సూచికలు పెరిగాయి, అక్కడి పెట్టుబడిదార్లను ధనవంతులను చేశాయి. 


ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD), అమెరికన్‌ S&P 500 7%, UK మార్కెట్‌ FTSE 5.2%, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (KOSPI) 9.8%, చైనా మార్కెట్‌ హ్యాంగ్ సెంగ్ (Hang Seng) 8.7%, జపాన్ మార్కెట్‌ నికాయ్‌ (Nikkei) 6.3%, ఆస్ట్రేలియన్‌ ASX200 6.9% పెరిగాయి.


బ్రెజిల్ మార్కెట్‌ బోవెస్పా (Bovespa) మైనస్‌ 1%లో ట్రేడవుతున్నప్పటికీ, మన నిఫ్టీతో పోలిస్తే ఇది కూడా మెరుగ్గానే ఉన్నట్లు లెక్క.


మిగిలి గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే నిఫ్టీ పనితీరు దారుణంగా ఉండటానికి ప్రధాన కారణం చైనా, తైవాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు. 2022లోని పతనం కారణంగా అవి చాలా చవగ్గా, ఆకర్షణీయంగా మారాయి. 2022లో పెరుగుదల కారణంగా నిఫ్టీ ఖరీదుగా మారింది. అందువల్లే, FIIల డాలర్లు మన మార్కెట్‌ నుంచి ఇతర చౌక మార్కెట్లలోకి వెళ్లిపోతున్నాయి.


NSDL డేటా ప్రకారం, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు దలాల్ స్ట్రీట్‌లో ఎఫ్‌ఐఐలు $4.2 బిలియన్ల నికర విక్రయదార్లుగా (net sellers) ఉన్నారు. దీని అర్ధం, వాళ్లు కొన్న షేర్ల విలువను తీసేసి చూసినా, ఇంకా $4.2 బిలియన్ల ఎక్కువ అమ్మకాలు జరిపారు.


2022 ద్వితీయార్థంలో దాదాపు రూ. 1 లక్ష కోట్ల పెద్ద మొత్తంలో డబ్బును మన మార్కెట్‌లోకి ఎఫ్‌ఐఐలు పంప్ చేశారు. ఇప్పుడు, ఆ పెట్టుబడుల నుంచి కొంతమేర లాభాలను వెనక్కు తీసుకుంటున్నారు. 


ఎఫ్‌ఐఐలకు తోడు కొన్ని దేశీయ ఆందోళనలు కూడా నిఫ్టీని దెబ్బ తీశాయి. క్యాపిటల్ గెయిన్స్ పన్ను భారం పెరుగుతుందేమోనని బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఆ భయాలు తప్పని ఆ తర్వాత తేలినప్పటికీ, అదానీ వివాదం రెండు వారాలుగా ఇన్వెస్టర్ల మూడ్‌ను దెబ్బతీసింది.


నిఫ్టీ తిరిగి పుంజుకుంటుందా?
ప్రపంచ స్థూల ఆందోళనల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఒక స్పీట్‌ స్పాట్‌లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కార్పొరేట్‌ Q3 ఆదాయాలు సంఖ్యలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడాన్ని వాళ్లు ఉదహరించారు. ఇండెక్స్‌ మీద ఒత్తిడి మరికొంత కాలం సాగుతుందని, ప్రస్తుతం ఎక్కువగా ఉన్న వాల్యుయేషన్లు తగ్గగానే ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని అంటున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.