ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారు కార్న్ ఫ్లాక్స్‌ను అధికంగా తింటారు. దీన్ని ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేదు. పాలలో ఈ కార్న్ ఫ్లాక్స్ వేసుకుంటే చాలు బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అందుకే కార్న్ ఫ్లాక్స్ తక్కువ సమయంలోనే ఎక్కువ మంది మనసు దోచుకుంది. అయితే కార్న్ ఫ్లాక్స్ తినేవారికి ఒక షాకింగ్ న్యూస్... హార్వర్డ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో కార్న్ ఫ్లాక్స్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదని, పైగా ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని తేలింది.
కార్న్ ఫ్లాక్స్ తినడం వల్ల మధుమేహం, ఫ్యాటీ లివర్, ఊబకాయం, అధిక రక్తపోటు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లో వంట చేయడం కుదరనప్పుడు ఎక్కువమంది ఈ కార్న్ ఫ్లాక్స్ పై ఆధారపడిపోతారు. ఇది రెడీమేడ్ ఆహారం.కానీ దీన్ని తినడం వల్ల అలాంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.
కార్న్ ఫ్లాక్స్‌ను అల్పాహారంగా మార్చి, దాన్ని మరింత ఆరోగ్యవంతంగా చేయడానికి కొంతమంది దానిపై స్ట్రాబెర్రీలు, పండ్ల ముక్కలు, బాదం, తేనె కలుపుకుంటారు. ఎన్ని కలిపినా కూడా కార్న్ ఫ్లాక్స్ వల్ల శరీరానికి ప్రమాదమే. వీటిని మొక్కజొన్న పిండితోనే కదా తయారు చేస్తారు అనే సందేహం రావచ్చు. నిజమే వాటిని మొక్కజొన్న పిండితోనే తయారు చేస్తారు. కానీ అవి చక్కెరతో లోడ్ చేసి ఉంటాయి. అలాగే ఇవి ప్రాసెస్డ్ ఆహారం కోవకే వస్తాయి. నిల్వచేసిన ఆహారం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఒరిగేదేమీ లేదు. అంతా అనారోగ్యమే.
కార్న్ ఫ్లాక్స్ లో తక్కువ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. మధ్యాహ్నభోజనంలో ఆహారం అధికంగా తినే అవకాశం ఉంది. ఇలా తరచూ జరిగితే అధిక బరువు బారిన పడడం ఖాయం. అలాగే ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యం ప్రమాదం బారిన పడుతుంది.
డయాబెటిస్ ఉంటే
ఈ పరిశోధన చేసిన డాక్టర్ ఫ్రాంక్ హు మాట్లాడుతూ... కార్న్ ఫ్లాక్స్‌లో చక్కెర, ఉప్పు అధికంగా ఉంటాయని, ఇవి మధుమేహ రోగులకు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ప్రమాదం అని చెప్పారు. వీటిని తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఊబకాయం బారిన త్వరగా పడతారని, వీటివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని వివరించారు. పాలు కాస్త చక్కెర కలిపి తినేవారు కూడా ఉన్నారు. దీనివల్ల ప్రమాదం ఇంకా పెరుగుతుంది. డయాబెటిక్ రోగులు కార్న్ ఫ్లాక్స్ ను పూర్తిగా మానేయాలి. వారికి తెలియకుండానే రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి. అంతేకాదు కార్న్ ఫ్లాక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ 93. అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మధుమేహ రోగులకు కార్న్ ఫ్లాక్స్ పూర్తిగా మంచివి కావు.
Also read: సమీప భవిష్యత్తులో భారతీయులను పట్టి పీడించే ఆరోగ్య సమస్యలు ఇవే - చెబుతున్న అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.