చైన్ మార్కెటింగ్‌లో దేశవ్యాప్తంగా పట్టు సాధించిన ఆమ్‌వే సంస్థకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ) సోమవారం గట్టి షాకిచ్చింది. ఆమ్‌వేకు చెందిన రూ.757.77 కోట్ల ఆస్తులను సీజ్ చేస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. జప్తు చేసిన ఆస్తుల్లో స్థిర, చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలు కూడా ఉన్నాయి. గొలుసు కట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్‌వే సంస్థపై ఇదివరకే పలు కేసులు నమోదు కాగా.. వాటి ఆధారంగా ఈడీ కూడా ఆమ్‌వేపై కేసు నమోదు చేసింది. పలు కీలక ఆధారాలను సేకరించిన ఈడీ అధికారులు వాటిని ఈడీ కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాలతో ఆమ్‌వేకు చెందిన రూ.757.77 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. అటాచ్ చేసిన ఆస్తుల్లో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని సంస్థ పరిశ్రమ భవనం, యంత్రాలు ఉన్నాయి. రూ.411.83 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు సీజ్ చేసిన ఈడీ.. 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 345.94 కోట్లను జప్తు చేసింది.
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబరులో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. దీంతో కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పిరమిడ్ తరహా నగదు చెల్లింపు పథకాలను అమలు చేయకూడదు. ఆమ్వే కంపెనీలు ఈ కామర్స్ సైట్ల ద్వారా సాగించే అమ్మాకాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని నిబంధనలు మార్చింది.
తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను కంపెనీలే పరిష్కరించాలి. ఇందుకు సంబంధించి కంపెనీలు తమ వెబ్ సైట్లలో ప్రస్తుత, అప్ డేటెడ్ అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ పొందు పరచాలి. ఫిర్యాదు అందిన 48 గంటల్లో రిసీప్ట్‌ను వినియోగదారుడికి అందేలా ఆ అధికారి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల అమలుకు బాధ్యతవహించేందుకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలి. డైరెక్ట్ సెల్లర్స్ పూర్తి కాంటాక్ట్ వివరాలకు సంబంధించి రికార్డులను ఆయా కంపెనీలు నిర్వహించాల్సి ఉంటుంది. డైరెక్ట్ అమ్మకాల వ్యాపారంలో ఉన్న విదేశీ కంపెనీలు ఇండియాలో కచ్చితంగా ఒక రిజిస్ట్రర్ ఆఫీసును భౌతికంగా కలిగి ఉండాలని రూల్స్ పెట్టింది.