Direct tax collection: మన దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థల ఆదాయంతో పాటు, వ్యక్తిగతంగా ప్రజల ఆదాయాల మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో ఎప్పటికప్పుడు పెరుగుదల కనిపిస్తోంది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జనవరి 10వ తేదీ నాటికి, దేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను (Gross direct tax) వసూళ్లు 24.58 శాతం పెరిగి రూ. 14.71 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes - CBDT) బుధవారం (11 జనవరి 2023) ఈ గణాంకాలను విడుదల చేసింది.


వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు పెరగడం వల్ల ఈ వృద్ధి నమోదైందని తెలిపింది.


పన్ను చెల్లింపుదారులకు తిరిగి ఇచ్చిన రిఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 12.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 19.55 శాతం ఎక్కువ. స్థూల ప్రత్యక్ష పన్నుల నుంచి రిఫండ్స్‌ను తీసేస్తే వచ్చే మొత్తాన్ని నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లుగా లెక్కిస్తారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాల్లో ఇది 86.68 శాతానికి సమానం. 10 నెలలు కూడా పూర్తి కాకుండానే (2022 ఏప్రిల్‌ 1 నుంచి 2023 జనవరి 10 వరకు) ఈ మొత్తం వసూలైంది ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లను రూ. 14.20 లక్షల కోట్లుగా బడ్జెట్‌ అంచనా వేసింది.


"జనవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్ల తాత్కాలిక గణాంకాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నాయి. జనవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 14.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన స్థూల వసూళ్ల కంటే ఇది 24.58 శాతం ఎక్కువ. " అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది.


కార్పొరేట్‌ ఆదాయపు పన్ను - వ్యక్తిగత ఆదాయపు పన్ను 
విడివిడిగా చూస్తే... 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 10వ తేదీ వరకు, స్థూల ప్రాతిపదికన కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు (Corporate income tax collections) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19.72 శాతం పెరిగాయి. ఇదే కాలంలో, స్థూల ప్రాతిపదికన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (Personal income tax collections) 30.46 శాతం పెరిగాయి. 


నికర ప్రాతిపదికన చూస్తే... కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు 18.33 శాతం, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 20.97 శాతం మేర పెరిగాయని CBDT వెల్లడించింది. 


రూ. 2.40 లక్షల కోట్ల రిఫండ్స్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో... 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 జనవరి 10వ తేదీ వరకు, ఈ మధ్య కాలంలో మొత్తం రూ. 2.40 లక్షల కోట్ల రిఫండ్స్‌ జారీ అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 58.74 శాతం ఎక్కువ.