Delhi-NCR based Supertech goes into insolvency, Bankruptcy leaves 25000 homebuyers fate in limbo: దేశంలో మరో స్థిరాస్తి కంపెనీపై దివాలా పిటిషన్ దాఖలైంది. దిల్లీకి చెందిన సూపర్‌టెక్‌ కంపెనీ (Supertech Insolvency) మార్చి 25న దివాలాకు వెళ్లింది. నోయిడా, గ్రేటర్‌ నోయిడా, గురుగ్రామ్‌, గాజియాబాద్‌లో ఈ కంపెనీకి కొన్ని కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. తమకు బకాయిలను చెల్లించడంలో విఫలమవ్వడంతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Union Bank of India) సూపర్‌టెక్‌పై పిటిషన్‌ దాఖలు చేసినట్టు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) వెల్లడించింది.


ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్‌ వల్ల దాదాపుగా 25,000 మంది ఇంటి కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్నేళ్లుగా వారంతా డబ్బు చెల్లించి ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఆశతో ఉన్నారు. దివాలా స్మృతి చట్టం (IBC) ప్రకారం దివాలా ప్రక్రియ సజావుగా చేపట్టేందుకు హితేశ్‌ గోయెల్‌ను ఎన్‌సీఎల్‌టీ నియమించింది. సూపర్‌టెక్‌ ప్రతిపాదించిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ను బ్యాంకు నిరాకరించడంతో మార్చి 17న ఆర్డర్‌ను ట్రైబ్యునల్‌ రిజర్వులో ఉంచింది. కాగా సూపర్‌ టెక్‌ కంపెనీ బ్యాంకులకు ఎంత బాకీ ఉందో, ఎంత మొత్తం చెల్లించాలో ఇంకా వివరాలు తెలియలేదు.


ప్రస్తుత ఆర్డర్‌పై మరోసారి అప్పీల్‌ చేసేందుకు ఎన్‌సీఎల్‌టీని సంప్రదిస్తామని సూపర్‌టెక్‌ తెలిపింది. 'ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఉత్తర్వులపై  కంపెనీ మరోసారి ట్రైబ్యునల్‌ను సంప్రదిస్తాం. ఇళ్ల కొనుగోలు దారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మేం ప్రాధాన్యం ఇస్తాం. కస్టమర్లకు ఇళ్లను అప్పగిస్తే బ్యాంకు రుణాలు తీర్చేందుకు డబ్బులు వస్తాయి. కంపెనీ ప్రాజెక్టులన్నీ ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాయి కాబట్టి ఎవరూ నష్టపోయేందుకు అవకాశం లేదు. ఈ ఆర్డర్‌ వల్ల సూపర్‌టెక్‌ కంపెనీ పనులపై ఎలాంటి ప్రభావం ఉండదు' అని కంపెనీ తెలిపింది.


'డబ్బులు చెల్లించిన వారికి ఇళ్లను అప్పగించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. గత ఏడేళ్లలో 40,000కు పైగా ఫ్లాట్లను అప్పగించిన రికార్డు మాకుంది. మిషన్‌ కంప్లీషన్‌ 2022లో భాగంగా మా కస్టమర్లందరికీ యూనిట్లను అప్పగిస్తాం. 2022, డిసెంబర్‌లోపు 7000 ఇళ్లను కొనుగోలుదారులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని సూపర్‌టెక్‌ కంపెనీ తెలిపింది.


దివాలా ప్రక్రియకు వెళ్లిన తొలి డెవలపర్‌ సూపర్‌ టెక్‌ కాదు. అంతకు ముందు జేపీ ఇన్ఫ్రాటెక్‌ ఇన్‌సాల్వెన్సీకి వెళ్లింది. 2017 ఆగస్టులో ఆ కంపెనీపై ఐడీబీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి దరఖాస్తు వచ్చిందని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. ఇక ముంబయికి చెందిన సురక్షా గ్రూప్‌ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు  కనిపించాయి.