Cricket World Cup 2023: ప్రపంచంలోని ఖరీదైన టోర్నమెంట్స్‌లో ఒకటైన ICC క్రికెట్ వరల్డ్ కప్ 2023, ప్రస్తుతం, ఇండియా వేదికగా జరుగుతోంది. గురువారం (05 అక్టోబర్ 2023) ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో క్రికెట్ సమరం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లు దాదాపు నెలన్నర పాటు సాగుతాయి, నవంబర్ 19న ఫైనల్ పోరుతో ముగుస్తాయి.
క్రికెట్ ఆడే దేశాలతో పాటు ఆడని దేశాల్లోనూ ఈ ఆటకు ఫ్యాన్స్ ఉన్నారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా & పరోక్షంగా కోట్లాది మంది చూస్తారు. కాబట్టి, దేశానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) అంచనా వేసింది.
ఎకానమీలోకి ₹22,000 కోట్లు
2023 క్రికెట్ ప్రపంచ కప్ వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థలోకి దాదాపు ₹ 22,000 కోట్లు (2.6 బిలియన్ డాలర్లు) వచ్చి చేరతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిస్ట్‌లు అంచనా వేశారు.
నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ మెగా టోర్నమెంట్, దేశీయంగా & అంతర్జాతీయంగా పెద్ద సంఖ్యలో వీక్షకులను ఆకర్షిస్తుందని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లు దేశంలోని 10 నగరాల్లో జరుగుతాయి. దీనివల్ల ప్రయాణ, ఆతిథ్య రంగాలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది ఎకనమిస్ట్‌ల లెక్క.
2011 తర్వాత మొదటిసారిగా భారత్‌లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్, మన దేశంలో సెప్టెంబర్‌లో ప్రారంభమైన మూడు నెలల పండుగ సీజన్‌తో సమానంగా సాగుతుంది. క్రికెట్ ప్రేమికులు "సెంటిమెంటల్ పర్చేజెస్" చేస్తారు. దీంతో పాటు ఫెస్టివ్ సీజన్ కొనుగోళ్లు ఉండనే ఉన్నాయి. కాబట్టి రిటైల్ రంగానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
2019 క్రికెట్ ప్రపంచ కప్‌ను టెలివిజన్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో, డైరెక్టుగా మొత్తం 552 మిలియన్ల మంది (55.2 కోట్లు) భారతీయులు చూశారు. ప్రస్తుతం ఇండియాలోనే మ్యాచ్‌లు జరుగుతున్నాయి కాబట్టి, భారతీయ వీక్షకుల సంఖ్య 2019 కంటే ఈసారి చాలా ఎక్కువగా ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా టీవీ హక్కులు & స్పాన్సర్‌షిప్ రెవెన్యూ రూపంలో ₹ 10,500 కోట్ల నుంచి ₹ 12,000 కోట్ల వరకు రావచ్చని లెక్క కట్టారు.
అయితే, ప్రపంచకప్ ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచే ప్రమాదం ఉంది. క్రికెట్ టోర్నీ కారణంగా, ఈ నెలన్నర పాటు ఎయిర్‌లైన్ టిక్కెట్లు, హోటల్ అద్దెలు పెరిగాయి. మ్యాచ్‌లు జరిగే 10 నగరాల్లో అసంఘటిత రంగంలోనూ రేట్లు పెరగవచ్చు. ఇది పండుగ సీజన్‌పైనా ప్రభావం చూపుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిస్ట్‌లు చెబుతున్నారు. ఈ కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో ద్రవ్యోల్బణం (Inflation) 0.15%-0.25% మధ్య పెరగవచ్చని అంటున్నారు.
టోర్నమెంట్ టిక్కెట్ల అమ్మకాలపై టాక్స్ కలెక్షన్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీపై 'గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్' (GST) వసూళ్లతో కేంద్ర ఖజానాకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరవచ్చు. దేశానికి అదనపు ఆర్థిక బలాన్ని అందిస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ప్రకటన ఖర్చు ఒక్కో సెకను రూ.3 లక్షలు
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం... గత ప్రపంచకప్‌తో (2019) పోలిస్తే ఈసారి ప్రపంచకప్‌లో ప్రకటనల రేటు చాలా భారీగా పెరిగింది. ఇప్పుడు, క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు 10 సెకన్ల స్లాట్ కోసం కంపెనీలు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ప్రతి సెకను ప్రకటన ఖరీదు దాదాపు 3 లక్షల రూపాయలు. గత ప్రపంచకప్ కంటే ఇది 40 శాతం ఎక్కువ. మొత్తం మెగా ఈవెంట్ సమయంలో, అన్ని బ్రాండ్స్ కలిపి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రకటనల కోసం 240 మిలియన్ డాలర్లు (దాదాపు 2,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయబోతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చిన ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్‌బీఐ నిర్ణయానికి ఒక రోజు ముందే షాకింగ్ యాక్షన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial