Credit Card Transactions Crossed RS 1.13 Lakh Crore In May Month Says RBI : దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మేలో క్రెడిట్‌ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అంతకు ముందు నెల్లో రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా మేలో ఆ విలువ రూ.1.13 లక్షల కోట్లకు చేరుకుంది. నెల వారీగా చూస్తుంటే వినియోగం విపరీతంగా పెరిగినట్టు తెలుస్తోంది.


మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్ కార్డు యూజర్లు రూ.71,429 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఖర్చు చేసినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (POS) యంత్రాల వద్ద రూ.42,266 కోట్లు ఖర్చుచేయడం గమనార్హం.


లావాదేవీల సంఖ్య పరంగా పీవోఎస్‌ యంత్రాల ద్వారా 12.2 కోట్లు జరగ్గా ఆన్‌లైన్‌లో 11.5 కోట్లు నమోదయ్యాయి. దీనిని బట్టి కార్డుదారులు ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో అధిక విలువైన లావాదేవీలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏప్రిల్‌ నెలలో యూజర్లు ఆన్‌లైన్‌లో రూ.65,652 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టగా పీవోఎస్‌ యంత్రాల ద్వారా రూ.39,806 కోట్ల విలువైన వస్తువుల్ని సొంతం చేసుకున్నారు. ఇక డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో రూ.21,104 కోట్లు ఖర్చు చేయగా పీవోఎస్‌ యంత్రాల ద్వారా రూ.44,305 కోట్లు ఖర్చుపెట్టారు.


Also Read: రిలయన్స్‌ నుంచి మరో సంచలనం? రిటైల్‌ యూనిట్‌ ఛైర్‌పర్సన్‌గా ఇషా అంబానీ!


Also Read: రూపాయి.. నువ్వే బక్కచిక్కితే ఎట్లా!! మేం ఎట్లా బతకాలి చెప్పు!!


మే నెల్లోనే మరో 20 లక్షల క్రెడిట్‌ కార్డులు ఆర్థిక వ్యవస్థలో పెరిగాయి. ఏప్రిల్‌లో కార్డుల సంఖ్య 7.51 కోట్లు ఉండటం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 1.72 కోట్లకు పెరిగింది. ఎస్‌బీఐ (1.41 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (1.33 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేటు బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు జారీ చేయడంపై మార్చిలో ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేయడమే ఇందుకు కారణం.