Indian rupee hits record low of 78.96 against US dollar in early trade : ఎవరికైనా ఆపదొస్తే వెంటనే గుర్తొచ్చేది 'రూపాయి'! అలాంటి భారత కరెన్సీ ఇప్పుడు బక్కచిక్కుతోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కొండెక్కుతున్న ముడి చమురు ధరలతో విలవిల్లాడుతోంది. బుధవారం నాటి సెషన్లో ఆల్‌ టైమ్‌ కనిష్ఠాన్ని నమోదు చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఒక్కసారిగా 11 పైసలు పతనమై రికార్డు కనిష్టమైన రూ.78.96 వద్ద కొనసాగుతోంది. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సైతం ఇందుకు ఓ కారణం.


ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌లో రూపాయి (Indian rupee) నేడు బలహీనంగా మొదలైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.78.86 వద్ద మొదలైంది. ఆ తర్వాత మరింత బలహీన పడి రూ.78.96కు పడిపోయింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే 11 పైసలు పడి ఆల్‌ టైమ్‌ లో లెవల్‌కు చేరుకుంది.


Also Read: రిలయన్స్‌ నుంచి మరో సంచలనం? రిటైల్‌ యూనిట్‌ ఛైర్‌పర్సన్‌గా ఇషా అంబానీ!


అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి రికార్డు కనిష్ఠమైన రూ.78.85కు చేరుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, ఆర్థిక వ్యవస్థలన్నీ మాంద్యం వైపు పయనిస్తుండటం, ఆసియా కరెన్సీలు, షేర్లు నష్టాల్లోకి జారుకోవడం రూపాయి బలహీనతకు కారణమని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్టు శ్రీరామ్‌ అయ్యర్‌ అన్నారు.


'ప్రస్తుత ఒడుదొడుకులు, పతనాన్ని అడ్డుకొనేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకుంటోంది. అయితే క్రూడాయిల్‌ ధరల పెరుగుదల రూపాయి బలపడకుండా అడ్డుకుంటోంది' అని అయ్యర్‌ తెలిపారు. మొత్తంగా ఈ నెల్లో ఇప్పటి వరకు రూపాయి 1.87 శాతం విలువ కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఏకంగా 6.28 శాతం పడిపోయింది. ప్రస్తుతం గ్లోబ్‌ ఆయిల్‌ బెంచ్‌మార్క్‌ బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ 0.88 శాతం తగ్గి బ్యారెల్‌ ధర 116.94 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ సైతం 0.08 శాతం తగ్గి 104.42 వద్ద కొనసాగుతోంది.


Stock Market Opening Bell 29 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. రూపాయి విలువ పడిపోతుండటంతో మదుపర్లలో ఆత్మవిశ్వాసం తగ్గుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్ల నష్టంతో 15,752, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 292 పాయింట్ల నష్టంతో 52,881 వద్ద కొనసాగుతున్నాయి.