Car Insurance, Warranty And Service Packages Difference In Telugu: మన దేశంలో కోట్లాది మంది కార్లను వినియోగిస్తున్నారు. ఎక్కువ మంది విషయంలో కారు "స్టేటస్‌ సింబల్‌"గా ఉన్నప్పటికీ, కొంతమంది విషయంలో మాత్రం అది "అవసరం"గా మారింది. చాలా మంది కార్లను కొంటున్నప్పటికీ.. ఆటో బీమా (auto insurance), ఆటో వారెంటీలు (auto warranties), రిపేర్ ప్యాకేజీల (auto repair packages) మధ్య తేడాను సరిగా గుర్తించలేకపోతున్నారు. సర్వీస్‌ ప్యాకేజీలు వారెంటీల తరహాలో ఒకే విషయాలను కవర్ చేస్తాయని; ఆటో బీమా ఉంటే చాలు, వారంటీ అవసరం లేదని ఎక్కువ మంది కార్‌ యూజర్లు పొరబడుతున్నారు. అయితే, ఈ అపోహలు హఠాత్‌ రిపేర్ ఖర్చులను, డ్రైవింగ్‌ సమయాల్లో ఇబ్బందులను కలగజేయవచ్చు. ఈ అపోహల నుంచి బయటపడాలంటే... వారంటీ, బీమా, సర్వీస్‌ ప్యాకేజీలు పోషించే పాత్రలను స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.


అపోహ 1: కారు వారంటీ, కార్‌ ఇన్సూరెన్స్‌ ఒకేలా ఉంటాయి
కారుకు బీమా ఉంటే చాలు, వారంటీ అవసరం లేదు అనే ఆలోచన చాలామందిలో ఉన్న అపార్థాల్లో ఒకటి. చాలా మంది కార్‌ యజమానులు తమ కారుకు నష్టం కలిగితే బీమా కవర్ చేస్తుందని, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ సమస్యల వంటి అంతర్గత సమస్యలకు కూడా బీమా సొమ్ము వస్తుందని నమ్ముతున్నారు. ఇది నిజం కాదు.


రోడ్డు ప్రమాదం, దేనినైనా ఢీకొనడం లేదా దొంగతనం వంటి సంఘటనల విషయంలో మాత్రమే వాహన బీమా అవసరం పడుతుంది. ఈ సంఘటనల వల్ల కలిగే నష్టాలకు అది ఆర్థిక భద్రత చేకూరుస్తుంది. ఆటో వారెంటీలు అలా కాదు. రోడ్డు  ప్రమాదం లేదా బాహ్య నష్టం వంటివి లేకపోయినా తలెత్తే ఇంజిన్ సమస్యలు, ఎలక్ట్రికల్ ఇబ్బందులు లేదా ఎయిర్ కండిషనింగ్ బ్రేక్‌డౌన్‌లతో సహా కారు అంతర్గత భాగాల లోపాలను వారెంటీలు కవర్ చేస్తాయి. ఉదాహరణకు... మీరు కార్‌లో లాంగ్‌ ట్రిప్‌ వేసినప్పుడు అకస్మాత్తుగా ఎయిర్ కండీషనర్ పని చేయడం ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా చేయదు, ఎందుకంటే ఇది ప్రమాదానికి సంబంధించిన సమస్య కాదు. అయితే, యాక్టివ్ వారంటీ ఆ రిపేర్‌ను కవర్ చేస్తుంది, మీ జేబులోంచి చెల్లించాల్సిన అవసరం ఉండదు.


Also Read: మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!


అపోహ 2: కారుకు బీమా ఉంటే వారంటీ అవసరం లేదు
ఆటో ఇన్సూరెన్స్‌ ఉన్నంతమాత్రాన వారంటీ అవసరం ఉండదనుకోవడం కూడా అపార్ధమే. వాస్తవానికి, వివిధ రకాల కవరేజీలను కలిపి అందించడానికి వారెంటీలు, బీమా కలిసి పనిచేస్తాయి. దొంగతనం లేదా యాక్సిడెంట్‌ వంటి బాహ్య ప్రమాదాలు మాత్రమే బీమా పరిధిలోకి వస్తాయి. గేర్‌ బాక్స్ వైఫల్యం వంటి అంతర్గత కారణానికి మీ బీమా సంస్థ డబ్బు చెల్లించదు. ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ వైఫల్యాల వల్ల వచ్చే సమస్యలను బీమాతో సంబంధం లేకుండా పరిష్కరించడానికి  'వారంటీ' పని చేస్తుంది. బీమా & వారెంటీ కలిస్తే మీ కారుకు పూర్తి రక్షణ అందిస్తాయి. అంతర్గత ఇబ్బందులు & బాహ్య ప్రమాదాల నుంచి రక్షణ కవచంలా నిలుస్తాయి. ముఖ్యంగా, లగ్జరీ కార్‌ యజమానులు ఈ రెండింటినీ తీసుకోవడం తెలివైన పని.


అపోహ 3: సర్వీస్ ప్యాకేజీ - వారెంటీ కూడా ఒకే ప్రయోజనం అందిస్తాయి
రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌ ప్యాకేజీలు కారు రిపేర్లను కవర్ చేస్తాయని చాలా మంది కారు ఓనర్లు తప్పుగా నమ్ముతున్నారు. వారంటీలు, సర్వీస్‌ ప్యాకేజీల విషయంలో గందరగోళానికి గురవుతున్నారు. పని చేయని కారు భాగాలను బాగు చేయడానికి లేదా రీప్లేస్‌ చేయడానికి అయ్యే ఖర్చును సర్వీస్ ప్యాకేజీ కవర్ చేయదు. ఇవి నిర్దిష్ట నిర్వహణలకు మాత్రమే పరిమితం.



సర్వీస్ ప్యాకేజీలు & వారెంటీలు విభిన్నం, ఎందుకంటే?...
టైర్ రొటేషన్స్‌, తనిఖీ, ఆయిల్‌ మార్చడం వంటివి రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌ ప్యాకేజీల ద్వారా కవర్ అవుతాయి. అనుకోని మరమ్మతులు లేదా ఏదైనా పార్ట్ ఫెయిల్యూర్‌ అయితే అవి కవర్ చేయవు. వారెంటీలు ఎలక్ట్రికల్ & మెకానికల్ భాగాల్లో లోపాలు/వైఫల్యాల నుంచి రక్షణ అందిస్తాయి. రీప్లేస్‌మెంట్‌, రిపేర్ల విషయంలో కార్‌ ఓనర్‌కు అదనపు ఖర్చు లేకుండా చూస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. వారంటీలు ఊహించని మరమ్మత్తు ఖర్చుల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. సర్వీస్‌ ప్యాకేజీలు మీ కారు మంచి కండిషన్‌లో ఉందన్న హామీని ఇస్తాయి.


సంపూర్ణ రక్షణ కోసం వారంటీ & బీమా ఎందుకు అవసరం?
బీమా, వారెంటీ అనేవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయలు కావు. మీ కారు సమగ్ర కవరేజీని అందించడానికి ఒకదానికొకటి అండగా నిలుస్తాయి. యాక్సిడెంట్‌, దొంగతనం వంటి బాహ్య ప్రమాదాలు బీమా పరిధిలోకి వస్తాయి. ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ అంతర్గత మెకానికల్, విద్యుత్ సమస్యలను వారంటీలు కవర్ చేస్తాయి. అలాగే.. రొటీన్ మెయింటెనెన్స్‌ను మాత్రమే సర్వీస్ ప్యాకేజీ కవర్ చేస్తుంది తప్ప లోపాలు లేదా పార్ట్ ఫెయిల్యూర్స్‌ను కాదు.


విలాసవంతమైన వాహనాల యజమానులకు, ప్రత్యేకించి మెర్సిడెజ్‌ బెంజ్‌ (Mercedes-Benz), బీఎండబ్ల్యూ (BMW), ఆడి (Audi), లాండ్‌ రోవర్‌ (Land Rover) వంటి వాహనాల ఓనర్లకు బీమా, వారంటీ రెండూ అవసరం. ఓనర్‌ టెన్షన్‌ లేకుండా కారును నడిపేలా ఇవి చేస్తాయి.


మరో ఆసక్తికర కథనం: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ