China Real Estate: అనేక దశాబ్ధాలు చైనా ప్రపంచ వ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పేరుకు అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటూనే ప్రపంచ పెద్దన్న అమెరికాను సైతం అధిగమించటానికి తన ప్రయత్నాలను అన్ని రంగాల్లో కొనసాగిస్తోంది. అయితే ఇటీవల అంతర్గతంగా ఏర్పడిన సంక్షోభాలతో చైనా ఆర్థిక వ్యవస్థ అనేక ఇబ్బందులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటిని సరిదిద్దేందుకు డ్రాగన్ కొత్త చర్యలను ఆవిష్కరించింది.


వాస్తవానికి చైనా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకోవటానికి అతిముఖ్యమైన కారణం చైనా రియల్ ఎస్టేడ్ వ్యాపారం ఇబ్బందుల్లో పడటమే. దీంతో చైనా రియల్టీ సంక్షోభం విస్తృతంగా మారటంతో ప్రస్తుతం అక్కడి స్థానిక ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో అమ్ముడుకాకుండా నిలిచిపోయిన గృహాలను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫస్ట్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించింది. వాస్తవానికి చైనా వేగవంతమైన వృద్ధికి వెనుక దాని రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దశాబ్ధాలుగా వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. చైనా జీడీపీలో రియల్టీ రంగానికి మెజారిటీ వాటా కలిగి ఉంది. 


వాస్తవానికి రియల్ ఎస్టేట్‌పై చైనా అతిగా ఆధారపడటం డెవలపర్‌లు, స్థానిక ప్రభుత్వాల మధ్య నిలకడలేని రుణ స్థాయిలకు దారితీసిందని వెల్లడైంది. చైనాలో అతిపెద్ద రియల్టీ సంస్థ ఎవర్ గ్రాండే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ఏకకాలంలో అనేక ప్రాజెక్టులు లాంచ్ చేయటం, అవి అమ్ముడుపోకపోవటంతో అతిపెద్ద అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికాలో రియల్టీ బబుల్ మాదిరిగా ప్రస్తుతం చైనాలో అదే పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని తర్వాత మరో దిగ్గజ సంస్థ కంట్రీ గార్డెన్ సహా అనేక ఇతర డెవలపర్‌లు తమ ప్రాజెక్ట్‌ల ఆర్థిక అవసరాల కోసం గణనీయమైన రుణాలను సేకరించారు.
 
చైనాలో అధిక రుణాలను అరికట్టడానికి ప్రభుత్వం 2020లో “త్రీ రెడ్ లైన్స్” విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, చాలా మంది డెవలపర్‌లు తమ ఆర్థిక బాధ్యతలను తీర్చలేకపోయారు. చైనా మీడియా కథనాల ప్రకారం హాంగ్‌జౌ లినాన్ జిల్లాతో సహా చైనాలోని స్థానిక ప్రభుత్వాలు, విక్రయించబడని గృహాలను సరసమైన ధరలకు అద్దెకు ఇవ్వడానికి కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తున్నాయని వెల్లడైంది. ఈ క్రమంలో చైనా తన సంక్షోభంలో ఉన్న ప్రాపర్టీ సెక్టార్‌ను బెయిలౌట్ చేయడానికి బిలియన్ల డాలర్లను కేటాయిస్తుంది.


హాంగ్‌జౌ చొరవ ముఖ్యంగా గుర్తించదగినది. ఎందుకంటే ఇది కొనుగోలు చేసిన యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో తిరిగి విక్రయించడానికి అనుమతించదు. చైనా స్టేట్ కౌన్సిల్ ప్రభుత్వ-యాజమాన్య సంస్థలను ప్రభుత్వ-ఆధారిత బ్యాంకుల నుంచి రుణాలను ఉపయోగించి కష్టాల్లో ఉన్న డెవలపర్‌ల నుంచి గృహాలను కొనుగోలు చేయడానికి ఒక ప్రాథమిక ప్రణాళికపై అభిప్రాయాన్ని కోరుతోంది. ప్రస్తుతం చైనా ప్రభుత్వం రియల్టీ క్రాష్ అడ్డుకునేందుకు చివరికి తామే స్వయంగా అమ్ముడుపోని ప్రాపర్టీలను కొనుగోలు చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రాణం పోయాలనే అతిపెద్ద ప్లాన్ వేస్తున్నారు. ఇది చైనా చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.