ChatGPT:
చాట్ జీపీటీ (ChatGPT) వేదిక ఓపెన్‌ఏఐ (OpenAI) అతి త్వరలోనే ఆర్థిక సంక్షోభంలోకి జారుకోనుంది. 2024 చివరి కల్లా ఆ కంపెనీ దివాలా తీయొచ్చని అనలిటిక్స్ ఇండియా మేగజిన్ ఓ నివేదిక వెల్లడించింది. ఓపెన్ ఏఐని నడిపించేందుకు ప్రతి రోజూ రూ.5.8 కోట్లు (7 లక్షల డాలర్లు) ఖర్చవుతోందని తెలిపింది. ప్రస్తుతానికి డబ్బులు ఖర్చవ్వడమే కానీ లాభాలు గడించే పరిస్థితి లేదని పేర్కొంది.
ఇంటర్నెట్లో చాట్ జీపీటీ ఓ సంచలనం. ఆటోమేటిక్‌గా కంటెట్ రాయడం, వివరాలు వెతికి ఇవ్వడంలో పేరుగాంచింది. ఫలితంగా చాలామంది కంటెంట్ రైటర్లు ఉపాధి కోల్పోయారు. ఈ ఓపెన్‌ఏఐ సంస్థను సామ్ ఆల్ట్‌మన్ స్థాపించారు. జీపీటీ -3.5, జీపీటీ-4 వాడుకొనేందుకు డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కంపెనీ సరిపడినంత ఆదాయం ఆర్జించడం లేదు. కనుచూపు మేరలో బ్రేక్ ఈవెన్ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.
గతేడాది నవంబర్లో చాట్ జీపీటీ మొదలైంది. మొదట్లో యూజర్ ఎంగేజ్‌మెంట్ అత్యధికంగా ఉండేది. అయితే క్రమంగా వీరి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జులై చివరి నాటికి యూజర్ల సంఖ్య ఇంకా పడిపోయి ఉంటుందని సిమిలర్ వెబ్ డేటా ద్వారా తెలుస్తోంది. జూన్‌లో 170 కోట్ల యూజర్లు చాట్ జీపీటీని వాడగా జులై నాటికి వీరి సంఖ్య 150 కోట్లకు తగ్గింది. అంటే 12 శాతం పడిపోయింది.
యూజర్ల సంఖ్య తగ్గడానికి కంపెనీల ఏపీఐలూ ఒక కారణమే! మొదట్లో చాట్ జీపీటీని వాడకుండా కంపెనీలు నియంత్రించాయి. కానీ ఇప్పుడు ఓపెన్ ఏఐ ఏపీఐలను యాక్సెస్ చేస్తూ సొంతంగా చాట్‌బాట్స్‌ను సృష్టించుకుంటున్నారు. దాంతో వాడే వారి సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఓపెన్ ఏఐకి ఇక్కడా ఓ సమస్య ఎదురవుతోంది. మార్కెట్లో ఓపెన్ సోర్స్ ఎల్‌ఎల్‌ఎం మోడల్స్ చాలా ఉన్నాయి. వాటిని ఉచితంగా వాడుకోవచ్చు. లైసెన్సుల ఇబ్బంది లేకుండా తమకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. తమ అవసరాలను బట్టి (use cases) ప్రత్యేకమైన పనుల కోసం కస్టమైజ్ చేసుకుంటున్నారు.
ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో మెటా లామా 2 (Llama 2) సృష్టించింది. వాణిజ్య అవసరాల కోసం దీనిని ఎవరైనా వాడుకోవచ్చు. అదే ఓపెన్ ఏఐలో డబ్బులు చెల్లించాలి. పైగా రిస్ట్రిక్టెడ్ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వస్తుంది. లైసెన్స్ సైతం వారికే ఉంటుంది. అలాంటప్పుడు మెరుగైన లామా కోసమే వెళ్తారని సిమిలర్ వెబ్ తెలిపింది.
ఏదేమైనా ఇప్పటి వరకైతే ఓపెన్ ఏఐ లాభాల్లోకి రాలేదు. చాట్ జీపీటీ అభివృద్ధి చేసినప్పటి నుంచి కంపెనీకి 540 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. మే నెలలో ఇవి రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్ పెట్టిన 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితోనే ప్రస్తుతం నెట్టుకొస్తోంది. అయితే 2023 చివరికి తమకు 200 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఓపెన్ ఏఐ అంచనా వేస్తోంది. 2024కు బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామని ధీమాగా ఉంది. ఇంతగా నష్టాలు వస్తున్నప్పుడు అదెలా సాధ్యమవుతుందో చూడాలి!!