TTD Tags For Kids: - అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు
- నడక మార్గంలో చిన్నారుల చేతికి ట్యాగ్ వేస్తున్న పోలీసు సిబ్బంది
- ఎవరైనా తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు ట్యాగ్ లు..
- ట్యాగ్ పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్
అలిపిరి నడక మార్గంలో చిన్నారులపై ఇటీవల చిరుత పులుల దాడులు పెరిగిపోయాయి. జూన్ నెలలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచింది. భక్తులు, బాలుడి తాత చిరుతను వెంబడిస్తూ గట్టిగా కేకలు వేయడంతో బాలుడ్ని అక్కడే వదిలిపెట్టింది. గాయపడ్డ బాలుడు కొన్ని రోజులకు కోలుకున్నాడు. టీటీడీ వారికి అన్ని విధాలుగా సహకరించింది, శ్రీవారి దర్శనం చేసుకునే ఏర్పాట్లు సైతం చేసింది. కానీ ఇటీవల నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలానికి చెందిన చిన్నారి లక్షితపై నడకమార్గంలో చిరుత దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం, చిన్నారులపై వరుస దాడులతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తం అయ్యారు.
అలిపిరిలో చిన్నారుల చేతికి ట్యాగ్ వేస్తున్న పోలీసు సిబ్బంది..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వచ్చే చిన్న పిల్లల తల్లిదండ్రులకు పోలీసులు పలు సూచనలు చేశారు. అలిపిరి నడక మార్గం వద్ద చిన్నపిల్లలకు ట్యాగ్స్ వేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఇలా వేసిన ట్యాగ్స్ ను గాలి గోపురం వద్ద, అదే విధంగా ఏడో మైలు వద్ద సిబ్బంది పరిశీలిస్తున్నారు. కేవలం 15 సంవత్సరాల లోపు చిన్నారులకు మాత్రమే పోలీసులు ట్యాగ్స్ వేయనున్నారు.
తప్పిపోతే గుర్తించేందుకు ట్యాగ్స్..
చిన్నారుల చేతికి ట్యాగ్స్ ఉంటే ఎవరైనా చిన్నారులు తప్పిపోతే గుర్తించేందుకు సులభంగా ఉంటుందని టీటీడీ, అటవీశాఖ భావిస్తోంది. 15 ఏళ్లలోపు చిన్నారుల చేతికి సిబ్బంది నడకమార్గంలో వేసే ట్యాగ్ ద్వారా ఎవరైనా తప్పిపోయినా త్వరగా తల్లిదండ్రుల వద్దకు చేరే అవకాశం ఉండడంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ట్యాగ్స్ పై చిన్నారుల తల్లిదండ్రుల పేర్లు, ఫోన్స్ నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్ ను రాసి చిన్నారులకు ట్యాగ్స్ ను వేస్తున్నారు. అంతే కాకుండా అలిపిరి నడక మార్గంలో హై అలర్ట్ ప్రకటించిన ప్రాంతంలో మధ్యాహ్నం సాయంత్రం 6 గంటల నుంచి 100 మందిని కలిపి గుంపులు గుంపులుగా 7వ మైలు నుంచి శ్రీ నృశింహ స్వామి వారి ఆలయం వరకు భక్తులను పంపుతున్నారు. అంతే కాకుండా ఈ గుంపులకు ముందు భాగంలోనూ, వెనుక పోలీసు సిబ్బంది భద్రత కల్పించనున్నారు. తద్వారా భక్తులకు ధైర్యం కల్పించడంతో పాటు చిరుతదాడుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: Tirumala News: శ్రీవారి భక్తులకు అలెర్ట్, అలిపిరి నడక మార్గంలో టీటీడీ కొత్త ఆంక్షలు ఇలా
చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు - ట్రాప్ కెమెరాలు ఫిక్స్
తిరుమల: అలిపిరి నడక మార్గంలో శుక్రవారం సాయంత్రం చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడం అందర్నీ కలచివేస్తోంది. చిరుత సంచారం, చిన్నారులపై వరుస దాడులతో నడక మార్గం భక్తుల భద్రతపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏడో మైలు నుండి శ్రీ నృసింహా ఆలయం వరకూ హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. చిరుతను బంధించేందుకు టీటీడీ అటవీశాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. 7వ మైలు నుంచి నరశింహస్వామి ఆలయం వరకు భక్తులుకు భధ్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. హై అలర్ట్ ప్రదేశంలో వన్య మృగాల సంచారాన్ని గుర్తించేందుకు ముప్పై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పగటి పూట డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణకు టీటీడీ చర్యలు చేపట్టింది.