టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాగునీరు ప్రాజెక్టులపై యుధ్దభేరి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 4వ తారీఖున అంగళ్లు, పుంగనూరు పర్యటన నేపథ్యంలో జరిగిన అల్లర్ల విషయంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అయితే ఈ అల్లర్లకు కారకులుగా ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటుగా, పార్టీలోని ముఖ్య నేతలపై, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే కొంత మంది టీడీపీ నాయకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. కానీ ఈ కేసులో అమెరికాలో ఉన్న ఓ టీడీపీ నేతపై పోలీసులు ఏఫ్ఐఆర్ నమోదు చేయడంపై బాధిత టీడీపీ నాయకుడు విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో‌ వైరల్ గా మారింది.


పుంగనూరు, అంగళ్ళు అల్లర్లు ఘటనలో అధికార పార్టీ కుట్ర ఉందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, మాజీ మంత్రులు‌ దేవినేని ఉమా, అమర్‌నాథ్ రెడ్డిలపై, టీడీపీ నాయకులు నల్లారి‌ కిరణ్ కుమార్, చల్లా బాబు, టీడీపీ‌ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వేంటనే ఎత్తివేయాలని వామపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లో టీడీపీ నాయకులు లేకుండా చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గంకు ఒడికడుతుందని అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జే.వేంకటేష్ విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


ఆగస్టు 4వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు పర్యటనలో వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని అడ్డుకోవడంతో పాటుగా అల్లర్లు సృష్టించారని, అమెరికాలో ఉన్న తనపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి RJ వెంకటేష్ మండిపడ్డారు. 'జూలై 11న నేను అమెరికాకు వెళ్లానని, అప్పటి నుండి నేను అమెరికాలోనే ఉన్నానని, అలాంటి సమయంలో తాను పుంగనూరు అల్లర్లలో ఎలా పాల్గొంటానంటూ ఆయన ప్రశ్నించారు. ఇలా పోలీసులు అధికార పార్టీ చెప్పినట్లు టీడీపీ నాయకులపై కేసు పెట్టడం చాలా దుర్మార్గమని అన్నారు. అయితే పోలీసులు నిజాలు తెలుసుకుని కేసులు పెట్టాలని అన్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి ఆదివారం రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్.జే. వెంకటేష్ వీడియో రూపంలో తన సందేశాన్ని పంపారు.