TTD Restriction On Children: అలిపిరి నడక మార్గంలో చిరుత పులుల సంచారం, చిన్నారులపై దాడులతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఇటీవల నడక మార్గంలో ఓ చిన్నారిపై దాడి చేసి చిరుత చంపేయడం అందరినీ కలచివేస్తోంది. భక్తుల రక్షణ కోసం ముఖ్యంగా తిరుమలకు వచ్చే చిన్నారుల రక్షణ కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.  అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్ళే భక్తులకు ఆంక్షలు విధించింది. ఇకపై అలిపిరి‌నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ళ లోపు చిన్నారులకి అలిపిరి నడక మార్గంలో అనుమతిని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా అలిపిరి నడక మార్గంలో హై అలర్ట్ ప్రకటించిన ప్రాంతంలో సాయంత్రం ఆరు గంటల నుండి 100 మందిని కలిపి గుంపులు గుంపులుగా ఏడోవ మైలు నుండి శ్రీ నృశింహ స్వామి వారి ఆలయం వరకు పంపనున్నారు. ఈ భక్తుల సమూహానికి ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ పోలీసు సిబ్బంది భధ్రత కల్పిస్తారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు కచ్చితంగా టీటీడీ విధించిన ఆంక్షలు పాటించాలని హెచ్చరించారు. 


నడక మార్గంలో వచ్చే తల్లిదండ్రులకు పోలీసులు పలు సూచనలు చేయడంతో పాటుగా, ఏడోవ మైలు వద్ద 15 సంవత్సరాల లోపు చిన్నారులకి పోలీసులు ట్యాగ్స్ ను వేస్తున్నారు. ట్యాగ్స్ చిన్నారుల చేతికి ఉండడం కారణంగా తప్పి పోయిన చిన్నారులను గుర్తించేందుకు సులభంగా ఉంటుందని, దీని ద్వారా పిల్లలు త్వరగా తల్లిదండ్రుల వద్దకు చేరే అవకాశం‌ ఉండడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ ట్యాగ్స్ పై చిన్నారుల తల్లిదండ్రుల పేర్లు, ఫోన్స్ నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్ ను రాసి చిన్నారులకు ట్యాగ్స్ ను వేస్తున్నారు.. అంతే కాకుండా ఈ గుంపులకు ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ పోలీసు సిబ్బంది భధ్రత కల్పిస్తున్నారు. 


చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు - ట్రాప్ కెమెరాలు ఫిక్స్ 
తిరుమల: అలిపిరి నడక మార్గంలో శుక్రవారం సాయంత్రం బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటనతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. నడక మార్గం భక్తుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడో మైలు నుండి శ్రీ నృసింహా ఆలయం వరకూ హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. చిరుతను బంధించేందుకు టీటీడీ అటవీశాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు‌ వచ్చే భక్తులను హైఅలర్ట్ గా ప్రకటించిన ప్రాంతంలో 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ముందు వైపు, వెనుక వైపు రోప్ లు ఏర్పాటు చేసింది. 
భక్తులకు సెక్యూరిటి సిబ్బందిని నియామించింది. నడక మార్గంలో కొన్నిచోట్ల ప్రతి పది మీటర్లకు ఓ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టీటీటీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 7వ మైలు నుంచి నరశింహస్వామి ఆలయం వరకు భక్తులుకు భధ్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేయడంతో పాటుగా, హై అలర్ట్ ప్రదేశంలో వన్య మృగాలను సంచారంను గుర్తించేందుకు ముప్పై ట్రాప్ కెమరాలను ఏర్పాటు చేశారు. పగటి పూట డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగే‌విధంగా టిటిడి చర్యలు చేపట్టింది.