మీరు ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేస్తుంటారా? అయితే, ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా నిశ్చింతగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిపేటప్పుడు కొన్ని సైట్లలో కార్డుకు సంబంధించిన వివరాలు ఇకపై సేవ్ అవ్వవు. టోకెనైజేషన్‌గా పిలిచే ఈ నూతన విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి రానుంది. భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశం ప్రకారం ఇకపై ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు తీసుకొనే సంస్థలు వినియోగదారుల కార్డుల వివరాలను సేవ్ చేసుకోవద్దని ఆదేశించింది. ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు కార్డుల టోకనైజేషన్ ప్రక్రియకు ఆర్బీఐ అనుమతించింది.
టోకెనైజేషన్ అంటే..
టోకెనైజేషన్ అంటే కార్డు వివరాలను.. ‘టోకెన్’గా పిలిచే ఒక ప్రత్యేక కోడ్‌తో భర్తీ చేసే ఒక ప్రాసెస్. ఏ రెండు కార్డులకూ ఈ టోకెన్ అనే కోడ్ ఒకేలా ఉండదు. ఇది టోకెన్ రిక్వెస్టర్ (కార్డు టోకనైజేషన్ కోసం కస్టమర్ నుండి అభ్యర్థనను అంగీకరించి, టోకెన్ జారీ చేయడానికి కార్డ్ నెట్‌వర్క్‌కు పంపే సంస్థ), చెల్లింపుల పరికరానికి వేర్వేరుగా ఉంటుంది. ఈ విధానాన్ని పాయింట్ ఆఫ్ సేల్ (పాస్) లేదా క్యూఆర్ కోడ్ పేమెంట్స్‌కు కూడా ఉపయోగిస్తారు.
కార్డులు టోకెనైజ్ ఎలా చేస్తారంటే..
కార్డు దారులు తమ కార్డులను టోకెన్ రిక్వెస్టర్ అందించే ఒక ప్రత్యేక యాప్ ద్వారా టోకెనైజ్ చేసుకోవచ్చు. ఈ టోకెన్ రిక్వెస్టర్ వినియోగదారుడి అభ్యర్థనను కార్డ్ నెట్‌వర్క్‌కు పంపుతుంది. కార్డు జారీచేసిన సంస్థ అనుమతితో, చివరికి టోకెన్ జారీ అవుతుంది. కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలు, క్యూఆర్ కోడ్‌లు, యాప్‌ల ద్వారా చెల్లింపులకు టోకెనైజేషన్‌ను అనుమతించారు.
వీసా, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలు టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా (టీఎస్‌పీ) వ్యవహరిస్తాయి. ఇవి మొబైల్ చెల్లింపులు లేదా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు టోకెన్‌లను అందిస్తాయి. తద్వారా కార్డు నంబర్, సీవీవీ నెంబరుకి బదులుగా ఏదైనా కొనుగోలుకు చెల్లింపు కోసం వాటిని ఉపయోగించవచ్చు.
గూగుల్ పే, ఫోన్ విషయంలోనూ..
అదేవిధంగా, కార్డు వివరాలను గూగుల్ పే లేదా పేటీఎం వంటి డిజిటల్ వాలెట్‌లలో రిజిస్టర్ చేసినప్పుడు, ఈ ప్లాట్‌ఫాంలు సంబంధిత టీఎస్‌పీలను టోకెన్ కోసం అడుగుతాయి. టీఎస్‌పీలు కస్టమర్ కార్డ్ జారీ చేసే బ్యాంక్ నుంచి డేటాను ధృవీకరించమని అభ్యర్థిస్తాయి. డేటాను ధృవీకరించిన తర్వాత, ఒక ప్రత్యేకమైన కోడ్ జనరేట్ అవుతుంది. ఈ కోడ్ తిరిగి మార్చలేని విధంగా వినియోగదారుడి ఫోన్‌తో లింక్ అవుతుంది. అందువల్ల, ప్రతిసారీ కస్టమర్ చెల్లింపు చేయడానికి తన ఫోన్‌ను ఉపయోగించినప్పుడు, కస్టమర్ తన అసలు కార్డు డేటాను వెల్లడించకుండానే టోకెన్ కోడ్‌ను షేర్ చేయడం ద్వారా లావాదేవీ జరపవచ్చు. మొబైల్ వాలెట్‌లు, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టళ్లలో చెల్లింపులకు ఇది మరింత రక్షణ కల్పిస్తుంది.
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! దిగొచ్చిన పసిడి ధర, స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇవి..
ప్రస్తుతం వినియోగదారుడి కార్డు వివరాలను వ్యాపారస్తులు తమ సిస్టంలో నిల్వ చేసుకునే అవకాశం ఉండగా.. కార్డ్-ఆన్-ఫైల్ (CoF) లావాదేవీల టోకెనైజేషన్‌ని ప్రవేశపెట్టినందున, ఇకపై జనవరి 1, 2022 నుండి కార్డ్ వివరాలను తమ సిస్టమ్‌లో నిల్వ చేయవద్దని ఆర్బీఐ తాజాగా ఆదేశించింది. ‘‘వచ్చే జనవరి 1 నుంచి కార్డు జారీ చేసిన సంస్థలు, బ్యాంకులు తప్ప మరే ఇతర సంస్థ కార్డు ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ సమయంలో ఆ కార్డు వివరాలను స్టోర్ చేసుకోకూడదు. గతంలో ఇలా స్టోర్ చేసుకున్న సమచారం మొత్తం డిలీట్ చేయాల్సి ఉంటుంది.’’ అని ఆర్బీఐ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధన అమలు ఆర్బీఐ గతంలో మార్చి 2020 నుంచి అమలవుతుందని ప్రకటించింది. కానీ, అదే సమయంలో ఈ ఏడాది డిసెంబరు వరకూ పొడిగించింది.
Also Read: Flying Car : మేడిన్ చెన్నై బ్రాండ్ ఎగిరే కారు ! రిలీజ్ ఎప్పుడు అంటే...?