PLI Scheme: సోలార్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీలకు గుడ్ న్యూస్ వచ్చింది. అధిక సామర్థ్యమున్న సౌర ఫలకాల (సోలార్ మాడ్యూల్స్) తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (Production Linked Incentive - PLI) పథకం కోసం మరో ₹19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది.
సౌర ఫలకాల కోసం మన దేశం పూర్తిగా విదేశీ దిగుమతుల మీదే ఆధారపడుతోంది. ఇప్పుడు దేశీయ ఉత్పత్తి కోసం ₹19,500 కోట్ల ప్రోత్సాహక నగదు కేటాయింపు వల్ల, ఈ రంగంలోకి ₹94,000 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా, దేశీయంగా 65 గిగావాట్ల (GW) పూర్తి, పాక్షిక సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) మాడ్యూల్స్ కెపాసిటీని సృష్టించాలన్నది లక్ష్యం.
హై ఎఫిషియెన్సీ సోలార్ PV మాడ్యూల్స్ తయారీ కోసం, PLI తొలి దశలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (Reliance New Energy Solar), అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Adani Infrastructure), షిర్డీ సాయి గ్రూప్‌ను (Shirdi Sai Group) కేంద్రం ఎంపిక చేసింది. వీటికి ₹4,500 కోట్లను కేటాయించింది. సోలార్ ఫోటోవోల్టాయిక్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించిన తర్వాత, అధిక సామర్థ్యమున్న PV మాడ్యూళ్ల విక్రయాల మీద ఐదేళ్ల పాటు ఈ ప్రోత్సాహకాలు అందిస్తారు.
ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్
కేబినెట్ ఆమోదించిన బిడ్ డిజైన్ ద్వారా.. 29 గిగావాట్ల ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ తయారీ ప్లాంట్లు, 18 గిగావాట్ల వేఫర్స్-మాడ్యూల్స్ ప్లాంట్లు, 18 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ ప్లాంట్లు సమీకృతమవుతాయని అంచనా.
మాడ్యూల్ తయారీలో నాలుగు దశలు ఉన్నాయి - పాలీసిలికాన్, వేఫర్స్, సెల్స్, మాడ్యూల్స్. మన దేశంలో ప్రస్తుతమున్న 15 GW ఉత్పత్తి ప్లాంట్లకు పాలీసిలికాన్ లేదా వేఫర్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. ఈ 4 దశలను PLI ద్వారా ప్రోత్సాహిస్తారు.
రూ.1.37 లక్షల కోట్ల మిగులు
ఈ పథకం ద్వారా రూ.1.37 లక్షల కోట్ల దిగుమతులు తగ్గుతాయని; ప్రత్యక్షంగా 1,95,000 మందికి, పరోక్షంగా 7,80,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కూడా కేంద్ర కేబినెట్ క్లియర్ చేసింది. సెమీకండక్టర్స్, డిస్‌ప్లే ఫ్యాబ్స్ & కాంపౌండ్ సెమీకండక్టర్ల తయారీకి ప్రోత్సాహక విధానాన్ని మరింత మెరుగుపరచే మార్పులను ఆమోదించింది.
సెమీకండక్టర్ పాలసీ
దేశంలో సెమీకండక్టర్స్, డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కొన్ని సవరణలను కేబినెట్ ఆమోదించింది. ఈ విధానం కింద ఉన్న మూడు పథకాలకు 50% నిధులను సమకూరుస్తుంది. డిస్‌ప్లే ఫ్యాబ్స్ స్కీమ్ కోసం ఇప్పటివరకు ఉన్న రూ.12,000 కోట్ల ప్రోత్సాహక పరిమితిని కూడా రద్దు చేసింది. అర్హత ఉంటే పూర్తి స్థాయి ఆర్థిక మద్దతు అందిస్తుంది.
నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ
లాజిస్టిక్స్ సేవలను కొత్త లాజిస్టిక్స్ పాలసీ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతుంది, పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేస్తుంది. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించడం, 2030 నాటికి గ్లోబల్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో టాప్ 25 ర్యాంకింగ్, సమర్థవంతమైన లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ కోసం ఒక మెకానిజం రూపొందించడం వంటివి ఈ పాలసీ లక్ష్యాలు.