Cabinet Incentive Scheme: 


దేశంలో డిజిటల్‌ ఎకానమీకి మరింత ఊపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ, రూపే డెబిట్‌ కార్డుల ద్వారా చేపట్టే తక్కువ విలువైన లావాదేవీలకు ప్రోత్సాహం అందించనుంది. ఇందుకోసం రూ.2600 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


2022-23 ఆర్థిక ఏడాది కోసం రూ.2600 కోట్లు కేటాయించామని ప్రభుత్వం తెలిపింది. రూపే డెబిట్‌ కార్డులు, పర్సన్‌ టు మర్చంట్‌ భీమ్‌ యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి వీటిని ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాలు, ఈ-కామర్స్‌ లావాదేవీలను ప్రమోట్‌ చేస్తామని వెల్లడించారు. 'ఈ పథకం ద్వారా పటిష్ఠమైన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ నిర్మాణం అవుతుంది. యూపీఐ లైట్‌, యూపీఐ 123పే సేవలు తక్కువ ఖర్చుకే లభ్యమవుతాయి. యూజర్‌ ఫ్రెండ్లీ డిజిటల్‌ పేమెంట్‌ ఆప్షన్లు మెరుగవుతాయి' అని ఆయన వెల్లడించారు.


భీమ్‌-యూపీఐ, రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాంతో స్టేక్‌ హోల్డర్లు, మర్చంట్లు తక్కువ ఖర్చుతోనే లావాదేవీలు నిర్వహించగలరని పేర్కొంది. ప్రజలు నగదు చెల్లింపుల నుంచి డిజిటల్‌ వైపు వేగంగా మళ్లేందుకు ఉపయోగపడుతుందని సూచించింది. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం గత బడ్జెట్లో చెప్పడం గమనార్హం.


దేశంలో డిజిటల్‌ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 2022, డిసెంబర్లో యూపీఐ ద్వారా 789.9 కోట్ల డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ ఏకంగా రూ.12.82 లక్షల కోట్లు. వార్షిక ప్రాతిపదికన చూస్తే డిజిటల్‌ లావాదేవీలు 59 శాతం వృద్ధి చెందాయి. 2020-21లో 5554 కోట్లుగా ఉన్న లావాదేవీలు 2021-22లో 8,840 కోట్లకు పెరిగాయి. ఇక భీమ్‌-యూపీఐ లావాదేవీలు 106 శాతం వృద్ధి చెందాయి. 2020-21లో 2233 కోట్లు ఉండగా 2021-22లో 4,597 కోట్లకు చేరుకున్నాయి.