Byju's Update: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌ కష్టాల రీడింగ్‌ అంతకంతకు పెరుగుతోంది. బైజూస్ అకౌంట్‌ బుక్స్‌ను క్షుణ్నంగా పరిశీలించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Corporate Affairs Ministry - MCA) ఆర్డర్‌ పాస్‌ చేసినట్లు సమాచారం. ఆరు వారాల్లోగా రిపోర్ట్ సబ్మిట్‌ చేయాలని ఆదేశించినట్లు కూడా మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బైజూస్‌పై SFIO (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) విచారణ ప్రారంభించినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే బైజూస్‌ ఆ వార్తలను తిరస్కరించింది.


సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు కేసు ట్రాన్స్‌ఫర్‌?
బ్లూంబెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం.. కంపెనీ ఇంటర్నల్‌ ఆడిట్‌లోని అంశాలు బయటకు వచ్చిన తర్వాత, బైజూస్ అకౌంట్‌ బుక్స్‌పై ఇన్వెస్టిగేట్‌ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత, దానిలోని వివరాలను మినిస్ట్రీ పరిశీలిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌ మ్యాటర్‌ను SFIOకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలా, వద్దా అన్నది రిపోర్ట్‌లోని విషయాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. MCA ఆధ్వర్యంలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ పని చేస్తుంది.


అకౌంట్‌ బుక్స్‌పై ఇన్వెస్టిగేషన్‌కు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించడంపై బైజూస్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇంతవరకు ఏమీ చెప్పలేదు. 


లోన్‌ రీస్ట్రక్చర్‌ చర్చలకు బ్రేక్‌!
బైజూస్‌, 1.2 బిలియన్‌ డాలర్ల టర్మ్ లోన్‌ రీస్ట్రక్చర్‌ కోసం చర్చలు జరపడానికి ప్రస్తుతం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఈ ఎడ్‌టెక్‌ కంపెనీ ఇబ్బందులను మరింత పెంచుతుంది.


ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ ప్రకటించడంలో బైజూస్ ఆలస్యం చేస్తోందనే కారణంతో, ఈ సంస్థ ఆడిటింగ్‌ కంపెనీ 'డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్', గత నెలలో తప్పుకుంది. బైజూస్‌ బోర్డ్‌లో మెంబర్లుగా ఉన్న పీక్ XV, ప్రోసస్ NV, చాన్-జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ ప్రతినిధులు కూడా అదే వారంలో బైజూస్‌ బోర్డ్‌కు రిజైన్‌ చేశారు. ఈ వరుస రాజీనామాల వల్ల బైజూస్ ఇమేజ్ బాగా దెబ్బతింది.


బైజూస్, 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ను ఇంకా ఫైల్‌ చేయలేదు. ఆడిటర్‌గా డెలాయిట్ రాజీనామా చేయడానికి, ముగ్గురు బోర్డు సభ్యుల నిష్క్రమణకు ఇదే మూల కారణం. 2022 ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఫలితాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా, 2023 ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఫలితాలను డిసెంబరు నాటికి వెల్లడించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


దీంతోపాటు, కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా లేఆఫ్స్‌కు సిద్ధమవుతోందని గత నెల వార్తలు వచ్చాయి. దాదాపు 500 నుంచి 1,000 మంది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులు ఈ రిట్రెంచ్‌మెంట్‌లో బాధితులవుతారని అంచనా. ఖర్చులు తగ్గించుకోవడానికి 2500 మంది ఉద్యోగులను తొలగిస్తామని గత ఏడాది అక్టోబర్‌లో బైజూస్‌ ప్రకటించింది.


ఈ కంపెనీ, ఒకప్పుడు భారతదేశంలో అత్యంత విలువైన $22 బిలియన్ల స్టార్టప్. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ సర్వీసులకు డిమాండ్‌ పెంచిన కొవిడ్‌-19 సమయంలో వివరీతంగా పాపులర్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదార్ల నుంచి బిలియన్ డాలర్లను ఆకర్షించింది. ఇప్పుడు, నేషనల్‌ పెన్షన్‌ ఫండ్‌కు పేమెంట్స్‌ చేయడంలోనూ ఇబ్బందులు పడుతోంది.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' TCS, HCL Tech, SpiceJet


Join Us on Telegram: https://t.me/abpdesamofficial