చెట్లు అనగానే ఆక్సిజన్‌ని మనకు అందించి కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోవడం అనే దృగ్విషయమే గుర్తొస్తుంది. అందుకే చెట్లు మనకి ప్రాణాన్ని పోస్తాయని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఒక రకమైన చెట్టు మాత్రం మన ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తింపు పొందింది. ఈ విషపూరితమైన చెట్లు కింద నిలుచున్నా కూడా ఎంతో కొంత హాని జరగడం ఖాయం. ఈ చెట్టు నుంచి వీచే గాలి కూడా ప్రమాదకరం. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు... ఎన్నో అధ్యయనాలు తర్వాత శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ చెట్టు పేరు ‘మంచినీల్’. దీనిని చూస్తే యాపిల్ చెట్టును చూసినట్టే ఉంటుంది. ఆకులు కూడా ఆపిల్ చెట్టుని ఆకులానే ఉంటాయి. ఎక్కువగా ఇది సముద్రపు ఒడ్డున మాంగ్రూవ్ చెట్ల మధ్యలో పెరుగుతుంది. అందుకే దీన్ని బీచ్ ఆపిల్ చెట్టు అని కూడా పిలుస్తారు.


ఎందుకంత ప్రమాదకరం?
ఈ చెట్టు పాలలాంటి ద్రవాన్ని స్రవిస్తుంది. ఆ ద్రవం చర్మానికి అంటితే చాలా ప్రమాదకరం. అది చర్మానికి అంటిన తర్వాత లోపలి వరకు ఇంకిపోతుంది. అప్పుడు చర్మంపై దద్దుర్లు, కురుపులు వస్తాయి. ఎలర్జీలు తీవ్రంగా మారుతాయి. వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ చెట్టుకింద ఓ అరగంట పాటు నిలుచున్నా కూడా ఆరోగ్యం క్రమంగా పాడవుతుంది. ఒళ్ళు దురదలు పెడుతుంది. ఏదో తెలియని వికారం మొదలవుతుంది. ఈ చెట్టు ఆకుల మీద పడిన వర్షపు నీళ్లు మన చర్మం మీద పడినా కూడా ప్రమాదమే. వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంది. చర్మం ఎర్రగా మారి దద్దుర్లు వస్తుంది. పుండుగా మారి రక్తం కారుతుంది. నొప్పి విపరీతంగా పెడుతుంది. చివరికి ఆ చెట్టుని తగలబెట్టాలని చూసినా కూడా ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. ఆ చెట్టును తగలబడితే వచ్చే పొగ వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంది. అందుకే ఈ చెట్టుతో పెట్టుకోకపోవడమే మంచిది. ఈ చెట్టు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు.


ఈ చెట్లు మనదేశంలో కనిపించవు. ఇదే మన అదృష్టం. దక్షిణ, ఉత్తర అమెరికా ప్రాంతాల్లోని కొన్ని బీచులలో ఇవి ఉంటాయి. 49 అడుగుల ఎత్తు వరకు ఈ చెట్లు పెరుగుతాయి. ఆకుపచ్చ, పసుపు రంగులో పూలు వస్తాయి. దీనికి చిన్న కాయలు కాస్తాయి. ఈ కాయలను తింటే చాలా ప్రమాదం. ఇవి తినడానికి తీయగానే ఉంటాయి. తీపిగా ఉన్నాయి కదా అని తింటే మాత్రం ప్రాణాలను తీసేస్తాయి. ఈ చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు, కానీ ఒకే ఒక ప్రయోజనం మాత్రం ఉంది. ఇవి బీచ్ ఒడ్డున మాంగ్రూవ్  చెట్ల మధ్యలో పెరుగుతూ ఉంటాయి. ఇవి సముద్రం వల్ల నేల కోత పడకుండా అడ్డుకుంటాయి. ఇదే వాటి వల్ల కలిగే ప్రయోజనం.


అదృష్టం కొద్దీ ఈ చెట్లు కారణంగా ప్రపంచంలో ఒక్క ప్రాణమూ పోలేదు. ఈ చెట్లు ఉన్నచోట అమెరికా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ చెట్లకు దగ్గరకు ఎవరు వెళ్ళకూడదు... అని బోర్డులు పెడుతుంది. అందుకే ఈ చెట్లు ఉన్నచోటికి ప్రజలు వెళ్లరు. ఈ చెట్లు పాలను పూర్వం గిరిజనులు వేటాడేందుకు ఉపయోగించేవారు. తమ బాణాలకు చివరన ఈ చెట్టు నుంచి కారే పాలను రాసి జంతువులను వేటాడేవారు. అది గుచ్చుకోగానే ఆ పాలు జంతువుల శరీరాల్లోకి చేరి వాటిని కదలకుండా చేసేవి. అప్పుడు వాటిని గిరిజనులు తేలికగా పట్టుకునేవారు.


చెట్లు ఇంత ప్రమాదకరమైనవని చెబుతున్న కూడా కరీబియాలోని ఒక ఫర్నిచర్ కంపెనీ మాత్రం ఫర్నిచర్ల తయారు చేసేందుకు ఈ చెట్లని ఉపయోగిస్తుంది. దానికోసం వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెట్లు కొమ్మలను ఎండలో బాగా ఎండబెడుతున్నారు. ఆ లోపల ఉన్న తేమ, పాలు అన్నీ ఆవిరి అయిపోయాక దాంతో ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. అయినా కూడా ఆ చెట్లను కొట్టే క్రమంలో ఎంతోమంది అలర్జీ బారిన పడిన సంఘటనలు ఉన్నాయి.


Also read: దంతాలు పరిశుభ్రంగా లేకపోతే మీ మెదడు పరిమాణం తగ్గిపోతుంది, జాగ్రత్త