Stock Market Today, 12 July 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.05 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 3 పాయింట్లు లేదా 0.01 శాతం గ్రీన్ కలర్‌లో 19,539 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
TCS, HCL టెక్: ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HCL టెక్, 2023-24 తొలి త్రైమాసిక ఆదాయాలను ఇవాళ ప్రకటిస్తాయి. మార్కెట్ ముగిసిన తర్వాత వీటి ఫలితాలు రావచ్చు. కాబట్టి, TCS, HCL టెక్ షేర్లు ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
స్పైస్‌జెట్: బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ ఇటీవలి కాలంలో ఆర్థికంగా బాగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, ఏవియేషన్ వాచ్‌డాగ్ DGCA, స్పైస్‌జెట్‌ను "ఎన్‌హాన్స్‌డ్ సర్వైలన్స్"లో పెట్టిందని PTI రిపోర్ట్ చేసింది. అయితే విమానయాన కంపెనీ ఆ వార్తను ఖండించింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 1,250 కోట్లను సమీకరించినట్లు మంగళవారం సాయంత్రం ఎక్సేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. మొత్తం 1,25,000 సెక్యూర్డ్, అన్‌రేటెడ్, అన్‌లిస్టెడ్, రీడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను కేటాయించింది. అయితే, ఈ రూ. 1,250 కోట్లను ఏ అవసరం కోసం సేకరించిందో వెల్లడించలేదు.
మహీంద్ర & మహీంద్ర: జూన్ నెలలో, మొత్తం 59,924 వాహనాలను విక్రయించినట్లు మహీంద్ర అండ్ మహీంద్ర (M&M) వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 51,319 యూనిట్లతో పోలిస్తే కొంత మెరుగుదల కనిపించింది.
J&K బ్యాంక్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి మూలధనం (టైర్ I/టైర్ II బాండ్స్) సమీకరించే ప్రతిపాదన పరిశీలించడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 15న సమావేశం అవుతుంది.
లుపిన్: ఓరల్ సాలిడ్స్, ఆప్తాల్మిక్ డోసేజ్ ఫామ్స్‌ను ఉత్పత్తి చేసే పితంపూర్ యూనిట్-2 తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన US FDA నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టును (EIR) అందుకున్నట్లు లుపిన్ ప్రకటించింది.
ఎల్‌టీఐమైండ్‌ట్రీ: దేశంలో ఆరో అతి పెద్ద ఐటీ కంపెనీ LTIMindtree, బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీలోకి గురువారం అడుగు పెడుతుంది. HDFC బ్యాంక్‌లో మెర్జర్ అయిన HDFC స్థానంలోకి ఈ ఐటీ కంపెనీ ప్రవేశిస్తుంది. ఇండెక్స్‌లో చేరడం వల్ల, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు), ఇండెక్స్ ఫండ్స్ వంటి పాసివ్ ఫండ్స్ నుంచి LTIMindtree లోకి దాదాపు $155 మిలియన్ల (₹1,275 కోట్లు) ఇన్‌ఫ్లోస్ చూడవచ్చు.
టాటా స్టీల్: 2018లో దివాలా తీసిన భూషణ్ స్టీల్‌ను స్వాధీనం చేసుకున్న టాటా స్టీల్, ఎగవేత దరఖాస్తుకు సంబంధించి దిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అందుకున్న మొత్తాల నుంచి టాటా స్టీల్ ప్రయోజనం పొందలేదని, సుమారు రూ.1,000 కోట్ల ప్రయోజనాలను రుణదాతలకు కేటాయించాలని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ ఆదేశాలను టాటా స్టీల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ITC: కంపెనీ ఛైర్మన్, ఎండీ, డైరెక్టర్‌గా సంజీవ్ పురి పదవీ కాలాలను మరో ఐదేళ్ల పాటు పొడిగించే ప్రతిపాదనను, ఆగస్టు 11న జరిగే ఐటీసీ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో (AGM) పరిశీలిస్తారు. 2019 జులై 22న ITC ఎండీగా పురి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2024 జులై 21 వరకు ఉంది. 2022-23లో సంజీవ్ పురి మొత్తం జీతం 53.08% పెరిగి రూ. 16.31 కోట్లకు చేరింది.
మరో ఆసక్తికర కథనం: రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ ఫస్ట్, దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ఇళ్లు కొనట్లా!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.