Nas Daily Nuseir Yassin: మనమంతా యూట్యూబ్‌ (YouTube) చూస్తుంటాం. విజ్ఞానం నుంచి వినోదం వరకు, ఎలాంటి వీడియో అయినా అందులో దొరుకుతుంది. యూట్యూబ్‌లో చూసి, వంట నుంచి విమానం నడపడం వరకు ఎన్నో రకాల పనులు నేర్చుకునేవాళ్లు మన చుట్టూ కనిపిస్తారు. వివిధ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ వాళ్లు వీడియోలు, టెక్ట్స్‌ పెడుతుంటారు. వీళ్లను సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు (Social media influencers) అంటారు. సబ్‌స్క్రిప్షన్స్‌, యాడ్స్‌, వివిధ కంపెనీలతో ఒప్పందాల రూపంలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బు సంపాదిస్తుంటారు. 


ఓ యూట్యూబర్ ఎంత సంపాదిస్తాడు?
ఓ యూట్యూబర్‌కు ఉన్న సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను బట్టి, అతనికి గుర్తింపు, యూట్యూబ్‌ నుంచి డబ్బు వస్తుంది. ఆ గుర్తింపు, డబ్బుతో వాళ్ల లైఫ్‌స్టైల్‌ మారిపోతుంది. దాన్ని చూసి మిగిలిన వాళ్లలో ఉదయించే మొదటి ప్రశ్న.. యూట్యూబ్‌ నుంచి నెలకు ఎంత సంపాదించొచ్చు?. ఇప్పుడు మనం ఒక ప్రముఖ యూట్యూబర్‌ గురించి తెలుసుకుందాం. చాలా మంది మైండ్స్‌లో ఉన్న ప్రశ్నకు అతను సమాధానం చెప్పాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోపడం ఖాయం.


'నాస్ డైలీ'గా (Nas Daily) ఇంటర్నెట్ ప్రపంచంలో ఫేమస్ అయిన ఇజ్రాయెల్‌కు చెందిన నుసైర్ యాసిన్ (Youtuber Nuseir Yassin) కథ ఇది. నుసైర్ ఒక కంటెంట్ క్రియేటర్‌ (Content creator). యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ (Facebook) సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌ అందిస్తాడు. ఇటీవల, జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ‍‌(Zerodha co-founder Nikhil Kamath) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా, తన ఆర్థిక విషయాలను నుసైర్ పంచుకున్నాడు.


2 నెలల్లో రూ.కోటికి పైగా సంపాదన ‍‌(Nas Daily Nuseir Yassin Income)
ప్రస్తుతం, ప్రతి నెలా సగటున 80 వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు నుసైర్ చెప్పాడు. ఇండియన్‌ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.67 లక్షలు అవుతుంది. ఏడాదికి చూస్తే, అతని సంపాదన 9.6 లక్షల డాలర్లు. అంటే, 8 కోట్ల 4 లక్షల రూపాయలు. ఈ విధంగా నుసైర్ సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేస్తూ ప్రతి రెండు నెలలకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతని వయస్సు 26 సంవత్సరాలు (Nas Daily Nuseir Yassin age) మాత్రమే. 


డబ్బులు ఇలా పెరిగాయి..
ఫేస్‌బుక్‌లో అతని ఫాలోయర్ల సంఖ్య 10 లక్షల నుంచి 1 కోటికి పెరిగిన వెంటనే, ఆ సోషల్ మీడియా సంస్థ ప్రతి నెలా 30 వేల డాలర్లు చెల్లించడం ప్రారంభించిందని నుసైర్ పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు. ఇది కాకుండా, అతను వివిధ బ్రాండ్లతో డీల్స్ ద్వారా నెలకు మరో 30 వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. నుసైర్‌ బాగా పాపులర్‌ కావడంతో, మాట్లాడేందుకు అతన్ని చాలా మంది ఆహ్వానిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా 20 వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఈ విధంగా అతని సంపాదన ప్రతి నెలా 80 వేల డాలర్లకు చేరింది.


నెలకు 80 వేల డాలర్ల ఆదాయాన్ని చేరుకోవడానికి తనకు దాదాపు 1000 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాలు పట్టిందని నుసైర్ చెప్పాడు. సోషల్ మీడియాలో కంటెంట్‌ను అందిస్తూ కేవలం 26 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు. ఆ తర్వాత, ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు. కంటెంట్‌ని రూపొందించడానికి నుసైర్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూనే ఉంటాడు. అతని సంస్థ ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొంటోంది.


మరో ఆసక్తికర కథనం: ఓపెన్‌ ఏఐలోకి తిరిగొచ్చిన ఆల్ట్‌మన్‌, మధ్యలో దూరిన మస్క్‌ - థ్రిల్లర్‌ మూవీలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో!