Sam Altman has returned as the CEO of OpenAI: గత వారం రోజులుగా టెక్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రాజేసిన ఓపెన్ ఏఐ (OpenAI) స్టోరీ తిరిగి తిరిగి మళ్లీ మొదటికే వచ్చింది. చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ (OpenAI’s Sam Altman) చివరకు అదే కంపెనీలోకి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని ఆ టెక్ దిగ్గజం స్వయంగా ప్రకటించింది. అయితే, ఈ స్టోరీ మధ్యలో దూరిన ఎలాన్ మస్క్ కూడా సోషల్ మీడియాలో ఓ కామెంట్ చేశారు.
'ఓపెన్‌ఏఐ సీఈఓగా (OpenAI CEO) తిరిగి బాధ్యతలు అప్పగించేందుకు సామ్ ఆల్ట్‌మన్‌తో సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. డైరెక్టర్ల బోర్డులోకి కొత్త వాళ్లు వస్తారు' అని, X ఫ్లాట్‌ఫామ్‌లో ఓపెన్‌ఏఐ ట్వీట్ చేసింది. 'స్పష్టమైన ఒప్పందం కోసం సహకరించుకుంటున్నాం, ఇంతకాలం ఎదురు చూసిన మీ సహనానికి చాలా ధన్యవాదాలు' అని కూడా ఆ ట్వీట్‌లో వెల్లడించింది.
ఓపెన్‌ఏఐని బెదిరించిన ఉద్యోగులు (employees letter to OpenAI)
వాస్తవానికి, ఆల్ట్‌మన్‌ను బలవంతంగా CEO సీట్ నుంచి దించేసిన తర్వాత, ఆ కంపెనీలోని 550 మంది ఉద్యోగులు డైరెక్టర్ల బోర్డుకు ఓ బెదిరింపు లేఖ రాశారు. ఆల్ట్‌మన్ సీఈవోగా తిరిగి తీసుకోవాలని, మిగిలిన బోర్డు సభ్యులంతా రాజీనామా చేయాలని ఆ లెటర్‌లో డిమాండ్ చేశారు. లేకపోతే తామంతా ఉద్యోగాలు వదిలేస్తామని బెదిరించారు. మైక్రోసాఫ్ట్‌లో (Microsoft) ఏర్పాటు చేస్తున్న కొత్త AI విభాగంలో తాము కూడా చేరతామని హెచ్చరించారు.
ప్రస్తుతం, ఓపెన్‌ఏఐలో 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 550 మంది ఉద్యోగాలు వదిలేస్తే ఓపెన్‌ఏఐ కుప్పకూలుతుంది. ఈ ముప్పు కారణంగా, తన నిర్ణయాన్ని ఓపెన్‌ఏఐ వెనక్కి తీసుకోవలసి వచ్చిందని, సామ్ ఆల్ట్‌మన్‌ను రీకాల్ చేయాల్సి వచ్చిందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
డైరెక్టర్ల బోర్డ్‌లోకి కొత్తగా వచ్చిన వాళ్లు - బయటకు వెళ్లినవాళ్లు
కంపెనీలోకి తిరిగి రావడానికి సామ్ ఆల్ట్‌మన్ కొన్ని షరతులను విధించారని సమాచారం. అందుకు ఓపెన్‌ఏఐ ఒప్పుకొందని తెలుస్తోంది. ఆల్ట్‌మన్ విధించిన షరతుల్లో భాగంగా కొత్త మెంబర్లతో డైరెక్టర్ల బోర్డ్ ఏర్పడిందని, సేల్స్‌ఫోర్స్ మాజీ కో-సీఈవో బ్రెట్ టేలర్ (Bret Taylor) ఛైర్మన్‌గా, అమెరికా మాజీ ఆర్థిక మంత్రి లారీ సమర్స్ (Larry Summers), ఆడమ్ డి ఏంజెలో (Adam D’Angelo) వంటి వాళ్లతో ఓపెన్‌ఏఐ కొత్త బోర్డు ఏర్పడిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న హెలెన్ టోనర్ (Helen Toner), తాషా మెక్‌కాలీ (Tasha McCauley), ఇల్యా సుట్‌స్కేవర్ (Ilya Sutskever) బోర్డ్ నుంచి బయటకు వెళ్లారు.
మధ్యలో వచ్చిన ఎలాన్ మస్క్ (Elon Musk's tweet on OpenAI)
ఓపెన్‌ఏఐ సీఈఓగా సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి తీసుకుంటామని ఆ కంపెనీ ట్వీట్ చేసిన తర్వాత... ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, X, టెస్లా సహా కొన్ని గ్లోబల్ కంపెనీలకు ఓనర్ అయిన ఎలాన్ మస్క్ కూడా ఓ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఒక 'నైస్ మార్కెటింగ్ స్టంట్'గా పేర్కొన్నారు. ఇంతా చేసి సాధించింది సున్నా అని ఎద్దేవా చేశారు.
మరో ఆసక్తికర కథనం: ఫ్లాట్‌గా ఓపెన్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ - చేదెక్కిన ఫార్మా, దూసుకెళ్తున్న ఆటో